Published : 07/11/2021 16:01 IST

Weight Loss: బరువు తగ్గించే బ్రేక్‌ఫాస్ట్‌! 

 

అధిక బరువు.. చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఎంతసేపు వ్యాయామం, యోగా సాధన చేసినా బరువు మాత్రం తగ్గడం లేదంటూ చాలామంది అంటుంటారు. ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే బరువును అదుపులో పెట్టుకోవడం తప్పని సరి. బరువు పెరగడం లేదా తగ్గడం ప్రధానంగా ఆహారపుటలవాట్లపైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. రోజంతా పని చేసేందుకు అవసరమైన శక్తి లభించేలా, అంతేకాకుండా మన బరువును కూడా అదుపులో ఉంచేలా అల్పాహారాన్ని తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ అల్పాహారంగా ఏమేం తీసుకోవాలో చూద్దాం!

ఆకలిని అదుపులో ఉంచే అవకాడో!
అవకాడో పళ్లలో సులభంగా జీర్ణమయ్యే కొవ్వు పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే అందులో పీచు పదార్థాలు కూడా ఎక్కువగానే ఉంటాయట. సగం ముక్కలో దాదాపు 7 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఆహారంలో ఓ అవకాడో పండును తీసుకుంటే దాదాపు 3 గంటలు ఆకలిని అదుపులో ఉంచుతోందని పరిశోధనల్లో తేలింది. శరీరానికి ఫైబర్‌తోపాటు ప్రొటిన్లు కూడా అవసరమైనందువల్ల అల్పాహారంలో ఓ చేపను కూడా తీసుకుంటే మరింత ఉపయోగముంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల బరువును అదుపులో పెట్టుకోవచ్చని చెబుతున్నారు.

ఓట్స్‌తో ఉపయోగమెంతో..?
శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవాలంటే ఓట్స్‌కు మించిన ఆహారం లేదని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే దీనిని అల్పాహార సమయంలో తీసుకుంటే మరింత ఉపయోగం. వీటిని నానబెట్టి తగినంత వెన్న కలిపి తింటే శరీరానికి అవసరమైన ఫైబర్‌తోపాటు, ప్రొటిన్లు కూడా లభిస్తాయి. అంతేకాకుండా చాలా సేపటివరకు కడుపు నిండుగా ఉందన్న భావన కలుగుతుంది. అందువల్ల మధ్యాహ్న భోజన సమయంలో తక్కువగా తింటాం. ఫలితంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

కొవ్వు కరిగేందుకు బెర్రీ పళ్లు

బరువును తగ్గించుకోవాలంటే బెర్రీ పళ్లు చక్కని మార్గం. ఇందులో ఉండే పుల్లటి పదార్థాలు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. అంతేకాక ఈ పళ్లలో ప్రొటిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మనకు మార్కెట్‌లో స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ.. ఇలా చాలా రకాల పళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది తీసుకున్నా ఫర్వాలేదు. కప్పు పెరుగులో కొన్ని బెర్రీ పళ్లు వేసి, కొద్దిసేపు ఉంచిన తర్వాత తింటే, రుచితోపాటు, ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించి, బరువును అదుపులో ఉంచడానికి సహాయపడతాయని పరిశోధనల్లో తేలింది.

గుడ్లతో మరింత బలం!
సంపూర్ణ ఆహారంలో గుడ్డు ప్రధానమని అందరికీ తెలుసు. గుడ్లు తినడం వల్ల బలంగా తయారవడమే కాకుండా బరువును కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారం వేళ రెండు మూడు గుడ్లను పగులగొట్టి, కొంచెం నూనెవేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత రుచికోసం కాస్త టమాటా సాస్ లేదా మిరియాల పొడి కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన  ప్రొటిన్లు, కొవ్వులు లభిస్తాయట. అయితే ఇవి మితంగానే తీసుకోవాలని నిపుణులు అభిప్రాయడుతున్నారు. మోతాదుకు మించి తింటే మరింత బరువు పెరిగే ప్రమాదముంది.

ప్రొటిన్‌ పౌడర్‌ ఉంటే సరిపోదా?
బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే అవసరమైన ప్రొటిన్లను సమపాళ్లలో తీసుకోవడం ముఖ్యం. అయితే ప్రతిసారీ మోతాదు ప్రకారం తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల ఆర్థికంగా కాస్త కుదురుకున్నవాళ్లు ప్రొటిన్‌ పౌడర్‌ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలను సమపాళ్లలో కలిపి తయారు చేస్తారు. ఉదయం అల్పాహారంలో ఆరోగ్య నిపుణులు సూచించినంత పౌడర్‌తోపాటు ఏవైనా కొన్ని పళ్లను తీసుకుంటే రోజంతా పని చేసేందుకు కావాల్సిన శక్తి లభిస్తుంది. అలాగే అనవసరపు కొవ్వు కూడా కరిగే వీలుంటుంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

 

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్