Corona: గుండెకు ప్రమాదం.. ఎలా అంటే?

కరోనా మహమ్మారి ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ  రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌, బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌లకు గురవుతున్నారు. అయితే కరోనా వైరస్‌ గుండెపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి...

Published : 18 May 2021 16:47 IST

ఇంటర్నెట్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ  రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌, బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌లకు గురవుతున్నారు. అయితే కరోనా వైరస్‌ గుండెపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెపోటు వచ్చే అవకాశాలూ ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి. అసలు కరోనా వైరస్‌ గుండెపై ఎలా ప్రభావం చూపిస్తుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

యువకుల్లోనూ ఎందుకు?

సాధారణంగా గుండె సంబంధిత వ్యాధులు కొంత వయస్సు మళ్లిన తర్వాత ప్రారంభమవుతాయి. కానీ, కరోనా సోకిన తర్వాత యువకుల్లోనూ గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రధానంగా బాహ్య శ్వాసకోశ అవయవమైన ముక్కు ద్వారా సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులతోపాటు శరీరంలోని వివిధ భాగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా వాటి పనితీరు మందగిస్తుంది. ఆ సమయంలో ఆయా అవయవాలకు రక్తాన్ని సరఫరా చేయడం గుండెకు కష్టమవుతుంది. దీంతో దాని పని తీరులో మార్పు కనిపిస్తుంది. కొవిడ్‌ మొదటి దశ వ్యాప్తితో పోల్చుకుంటే రెండో దశలో యువకులపై వైరస్‌ తీవ్రత ఎక్కువగా కనిస్తోంది. అప్పటి వరకు గుండె సంబంధిత సమస్యలేవీ లేని వారిలోనూ కొవిడ్‌ తర్వాత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

గుండె పోటు ఎందుకొస్తుంది?

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ చాలా మందిలో శ్వాసలో సమస్యలు, ఛాతీనొప్పి, బలహీనత, రక్తపోటు స్థిరంగా లేకపోవడం, అలసట తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత దాదాపు 70శాతం మందికి ఈ లక్షణాల్లో ఏదో ఒకటి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొవిడ్‌ నుంచి కోలుకున్న చాలా మందికి గుండెలో మంట ఎదురైనట్లు తేలింది. దీనికి ఆక్సిజన్‌ లేమి కూడా కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గినప్పుడు కూడా గుండెలో మంట పుడుతుంది. ఫలితంగా గుండె కండరాలు బలహీనపడి గుండెపోటుకు దారి తీస్తుంది.

రక్తం గడ్డకట్టడమూ కారణమే..!

కొవిడ్‌ సోకిన చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య రక్తం గడ్డలు కట్టడం. దీంతో శరీరంలో రక్తప్రసరణ సజావుగా సాగే వీలుండదు.శరీర కణజాలాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా గుండెకొట్టుకునే వేగం పెరిగి గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహార నియమాలు పాటించని వారిలో, శారీరక శ్రమ చేయని వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కొన్ని లక్షణాలను బట్టి ప్రమాదాన్ని ముందే ఊహించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఛాతీ బరువుగా అనిపించడం

ఛాతీ బరువెక్కడం, గట్టిగా బిగుసుకుపోవడం, ఛాతీపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు అనిపించడం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. సరైన డాక్టరును సంప్రదించాలి. కొన్నిసార్లు ఈ లక్షణాలు క్రమంగా కాళ్లు, చేతులకు కూడా వ్యాపించవచ్చు. మెడ నొప్పి, కడుపు నొప్పి కూడా వస్తాయి. ఇందులో ఏ లక్షణాలు తీవ్రమైనా ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

శ్వాసలో సమస్యలు

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత ఎప్పుడైనా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా, మాటలు తడబడుతున్నా ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. శ్వాసకోశ సమస్యలు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం అనేవి కరోనా ప్రధాన లక్షణాలు. రక్తంలో సరిపడా ఆక్సిజన్ లేకపోతే ఊపిరితిత్తులతో పాటు ప్రధాన అవయవమైన గుండెపైనా దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.

ఆక్సిజన్‌ స్థాయులు ఒక్కసారిగా పడిపోవడం

ఇటీవల ప్రతీ ఇంట్లో పల్స్‌ ఆక్సీమీటర్‌ ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకో తెలుసా? కరోనా సోకిన వారిలో ఒక్కసారిగా ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతున్నాయి. అది తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. సాధారణంగా ఆక్సిజన్‌ స్థాయి 94 పాయింట్లు ఉంటే ఎలాంటి భయం లేదు. అంతకంటే తగ్గితే వెంటనే డాక్టరును సంప్రదించాలి. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్‌ పడిపోతే గుండె వేగం పెరిగిపోతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ.

తలనొప్పి, మగతగా ఉండటం..

తలనొప్పి, మైకం కమ్మినట్లుగా ఉండటం కూడా గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలే. గుండెపై ఎక్కువగా భారం పడినప్పుడు, దాని కండరాలు బాగా అలసిపోతాయి. ఫలితంగా మెదడుకు రక్తప్రసరణ తగ్గిపోయి తలనొప్పిగా అనిపిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. మైకం కమ్మినట్లుగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛమైన గాలి వీచే ప్రదేశంలో కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. సమస్య తీవ్రమవుతోందనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.

విపరీతమైన చెమట

ఉన్నట్టుండి ఒక్కసారిగా చెమట పట్టడం కూడా గుండె నొప్పి వస్తుందనడానికి ముందస్తు హెచ్చరికే. విపరీతంగా చెమట పట్టడం వల్ల శరీర అవయవాలకు రక్తప్రసరణ చేయడానికి గుండె తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. మరోవైపు శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకించే సమయంలోనూ చెమట పడుతుంది. అయితే ఏ సందర్భంలో చెమట పడుతుందన్నది పరిశీలించి వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని