ఎన్‌95 మాస్క్‌ను ఎవరు కనిపెట్టారు?

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పుడు అందరూ మాస్కులు ధరిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకకుండా ...

Published : 29 Jun 2020 01:50 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పుడు అందరూ మాస్కులు ధరిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకకుండా ఈ మాస్కులు ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్‌95 మాస్కులు పాపులర్‌ కావడంతోపాటు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఈ మాస్కులు కరోనా చికిత్సలో వైద్యులకు ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర వహిస్తున్న మాస్కును అసలు ఎవరు తయారు చేశారు? దాని సంగతులేంటి? చూద్దాం..

నిజం చెప్పాలంటే మాస్క్‌ అనేక రూపాంతరాలు చెంది ఎన్‌95గా మారింది. తొలిసారి 1910లో చైనాలో ప్రబలిన ప్లేగు వ్యాధి నుంచి తప్పించుకోవడం కోసం చైనా కోర్టులో పనిచేసే ఓ ఉద్యోగి వస్త్రంతో మాస్క్‌ను తయారు చేశాడు. బ్యాక్టీరియా నుంచి మనిషి కాపాడిన తొలి మాస్క్‌ ఇదేనని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మాస్క్‌లనే 1918 ఫ్లూ సమయంలో చాలా మంది వాడారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తొలి ప్రపంచ యుద్ధంలో గ్యాస్‌ మాస్క్‌లు తయారయ్యాయి. 1970లో యూఎస్‌ గనుల శాఖ కార్మికుల కోసం సింగిల్‌ యూజ్‌ రెస్పిరేటర్స్‌ను రూపొందించగా... 1972లో 3ఎం అనే సంస్థ తొలిసారి ఎన్‌95 రిస్పిరేటర్స్‌ను రూపొందించింది. అయితే వాటిని కేవలం వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు మాత్రమే వాడేవారు. 

కానీ, ఆరోగ్యసంరక్షణలో భాగంగా సూక్ష్మక్రిములను అడ్డుకొనే తొలి ఎన్‌95 మాస్క్‌ను 1992లో యూనివర్సిటీ ఆఫ్‌ టెన్నెస్సీ ఫ్రొఫెసర్‌ పీటర్‌ తై రూపొందించారు. 1995లో ఈ ఎన్‌95 మాస్క్‌కు పెటెంట్‌ హక్కులు కూడా పొందారు. మొదట్లో దీనికి టుబెర్కులొసిస్‌ నుంచి రక్షణ పొందడానికి ఈ మాస్క్‌లను వాడారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ మాస్క్‌లు ఎంతో సహకరిస్తున్నాయి. అప్పుడెప్పుడో రిటైర్‌ అయిపోయిన పీటర్‌ తై ప్రస్తుతం మళ్లీ మాస్క్‌లపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని