ఆహారాన్ని అద్భుతంగా నిల్వ చేసే ‘అరేడియేషన్’.. భారత్‌లో తొలిసారి ఉల్లిపాయలపై ప్రయోగం!
ఉల్లిపాయల (onions) ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు భారత (India) ప్రభుత్వం ‘అరేడియేషన్’ టెక్నాలజీని (Irradiation technology) ప్రవేశపెట్టనుంది. దాంతో ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రైతులు, వినియోగదారులకు లాభం చేకూరుతుంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాటా (Tamato) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో మార్కెట్‌కు వెళ్లి వీటిని కొనాలంటేనే సామాన్యుడు వెనకడుగు వేసే పరిస్థితి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి (onions) కూడా ఇలాగే ఉండేది. అందుకే భారత ప్రభుత్వం ఓ సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తొలుత దాన్ని ఉల్లిపాయలపై ప్రయోగించనుంది. దాంతో ఎక్కువ కాలం ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. పైగా ఆ పంట పండించిన రైతులు సైతం నష్టాల బారిన పడకుండా చూడొచ్చు. ఇంతకీ ఏంటా టెక్నాలజీ? ఎలా పనిచేస్తుంది? ఓసారి పరిశీలిస్తే..
ఏంటీ ‘అరేడియేషన్’?
‘అరేడియేషన్’(irradiation) ప్రక్రియలో ఆహారాన్ని రేడియేషన్ అయనీకరణం చేస్తారు. ఇందుకోసం గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, ఎలక్ట్రాన్ కిరణాలను వినియోగిస్తారు. ప్రస్తుతం మన ఉల్లిపాయలను గామా రేడియేషన్‌కు గురి చేయనున్నారు. ఇలా చేయడం వల్ల అందులోని సూక్ష్మజీవులు, కీటకాలు నశించడంతో వాటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పాలను పాయిశ్చరైజ్ చేయడం, పండ్లు, కూరగాయాలను క్యానింగ్ చేయడం వల్ల వినియోగదారులకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో అలాంటి ప్రయోజనాలే ఈ విధానంలోనూ కలుగుతాయి. పేరులో రేడియేషన్ ఉంది గనక ఈ సాంకేతికత ఆహారాన్ని రేడియోధార్మికతగా మార్చదు. నాణ్యత, రుచి, ఆకృతి తదితర విషయాల్లో ఎలాంటి మార్పు తీసుకురాదు.
‘అరేడియేషన్’లో ఏ మార్పు జరిగినా అది చాలా స్వల్పంగా ఉంటుంది. అందుకే ఏదైనా పదార్థం ‘అరేడియేషన్’కు గురైందా? అనేది చూసి గుర్తించడం చాలా కష్టం. ఈ విధానాన్ని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆమోదించాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీకి చెందిన లెవిస్ స్టాడ్లర్ అనే శాస్త్రవేత్త తొలిసారి విత్తనాలపై ఈ ప్రయోగం చేశాడు. ఈ ప్రక్రియ తృణ ధాన్యాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లిపై సమర్థవంతంగా పనిచేసింది.
ప్రయోజనాలివే..
- ‘అరేడియేషన్’ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల వ్యాధులు తగ్గుతాయి. ఆహారంలోని సాల్మోనెల్లా, ఈకోలి వంటి హానికారక జీవులు నశిస్తాయి.
- ‘అరేడియేషన్’ వల్ల పండ్లు, కూరగాయల నిల్వ కాలం పెరుగుతుంది. అవి త్వరగా కుళ్లిపోవడానికి కారణమయ్యే జీవులను నాశనం చేయడంతో ఇది సాధ్యపడుతుంది.
- పండ్లలోని కీటకాలు నశిస్తాయి. శీతల గిడ్డంగిలో వాటిని నిల్వ చేసేందుకు మళ్లీ ప్రత్యేకంగా మందులు వాడాల్సిన అవసరం ఉండదు.
- ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉంచితే మొలకలు వస్తాయి. ఈ ప్రక్రియ అలా రానివ్వదు. అంతేకాదు త్వరగా పక్వానికి రాకుండా అడ్డుకుంటుంది.
- ‘అరేడియేషన్’ క్రిమిరహితంలా పనిచేస్తుంది. దాంతో శీతల ప్రదేశాల్లో నిల్వ చేయకపోయినా పండ్లు, కూరగాయలు చెడిపోవు.
ధరల్లో హెచ్చుతగ్గుల నివారణ
ఉల్లిపాయల ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు ఈ ఏడాదిలో భారత ప్రభుత్వం సుమారు 3లక్షల టన్నుల ఉల్లిని అదనపు బఫర్ స్టాక్‌గా సేకరించనుంది. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC) సహాయంతో ఉల్లిపాయలపై ‘అరేడియేషన్’ సాంకేతికతను ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. దీని ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లిపాయలను శీతల గిడ్డంగికి తరలించక ముందే ‘అరేడియేషన్’ ప్రక్రియ చేస్తారు.
ఒడిశాలో పోలీసు పావురాలు.. విధి నిర్వహణలో సత్తా చాటాయి!
ఇదీ.. ప్రభుత్వ ప్రణాళిక
భారత్‌లో పండించిన ఉల్లి త్వరగా కుళ్లిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసినా అవి మొలకెత్తి వృథాగా పోతున్నాయి. 25 శాతంగా ఉన్న ఈ నష్టాన్ని 10-12 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులు సుమారు 20 రోజులపాటు కొనసాగుతాయి. అదనపు బఫర్ స్టాక్, ‘అరేడియేషన్’ టెక్నాలజీ సహాయంతో ఆ కాలంలో ధరల్ని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద 150 టన్నుల ఉల్లిపాయలను ‘అరేడియేషన్’ చేయనున్నారు. మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో ప్రక్రియ సాగనుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ
-
పైకి లేచిన బ్రిడ్జ్.. కిందికి దిగలేదు: లండన్ ఐకానిక్ వంతెన వద్ద ట్రాఫిక్ జామ్
-
USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!
-
Karnataka Bandh: ‘కావేరీ’ పోరు: స్తంభించిన కర్ణాటక.. 44 విమానాలు రద్దు
-
Salaar release date: ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన టీమ్
-
CPI Ramakrishna: జగన్, అదానీల రహస్య భేటీ వెనుక మర్మమేంటి?: సీపీఐ రామకృష్ణ