AP High Court: సీఆర్డీఏ చట్టం ప్రకారం వ్యవహరించాల్సిందే: ఏపీ హైకోర్టు తీర్పు

ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం

Updated : 03 Mar 2022 11:36 IST

అమరావతి: ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

వేరే అవసరాలకు ఆ భూములు తనఖా పెట్టడానికి వీల్లేదు..

అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని.. రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికిి ఆ భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించొద్దు..

‘‘అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలి. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలి. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరు. అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదు. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదు. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలి’’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

అసలేం జరిగిందంటే..

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు) చట్టాలను సవాలుచేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే.. ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం(యాక్ట్‌ 11/2021) తీసుకొచ్చింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)ను అమలు చేసేలా, భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని కోరారు. సీఆర్‌డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని తదితర అభ్యర్థనతో వాదనలు వినిపించారు.

మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. నేడు 75 కేసుల్లో వేర్వేరుగా త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని