
కణితులన్నీ క్యాన్సర్లేనా!
ఇంటర్నెట్ డెస్క్ : శరీరంలో కణితులు కనిపించగానే చాలామంది కంగారు పడుతుంటారు. అది క్యాన్సర్‌కు సంబంధించిందేమోనని ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. రొమ్ముల్లో చిన్న గడ్డ కనిపించినా.. అది బ్రెస్ట్ క్యాన్సరేమోనని భయపడుతుంటారు. అయితే వాస్తవం ఏమిటంటే శరీరంలో కనిపించే ప్రతీ కణితీ క్యాన్సర్ వల్ల ఏర్పడింది కాదు. నూటికి 90 శాతం మనకు ఎలాంటి హానీ చేయని కణితులే ఉంటాయంటారు డాక్టర్లు. మరి వీటి గురించి మరింత అవగాహన ఏర్పరుచుకుందామా!
ప్ర: కణితి కనిపించగానే క్యాన్సర్ అని భావించటం సరైనదేనా?
జ: ప్రతి ట్యూమర్ కూడా క్యాన్సర్‌కు సంబంధించింది కాదు. వీటిలో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. అవి బినైన్, మాలిగ్నంట్, ప్రీ మాలిగ్నంట్‌లు. బినైన్ అంటే క్యాన్సర్ కాదు. కానీ.. ప్రీ మాలిగ్నంట్ అంటే కాన్సర్‌కు ముందు దశలో ఉండేది. ఇక మాలిగ్నంట్ అంటే క్యాన్సర్ ట్యూమర్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ వేరువేరు లక్షణాలు కలిగిఉంటాయి. వీటి గుర్తింపు దగ్గర నుంచి చికిత్స వరకు కూడా వేరువేరు పద్ధతులు ఉంటాయి.
ప్ర: హానికరం కాని కణితులు శరీరంలో ఎక్కడెక్కడ వస్తుంటాయి?
జ: బినైన్ ట్యూమర్స్‌ను హానికరం కానీ కణితులుగా చెప్పవచ్చు. ఇవి శరీరంలోని అనేక భాగాల్లో, అనేక టిష్యూల నుంచి ఏర్పడుతుంటాయి. సాధారణంగా కనిపించే బినైన్ ట్యూమర్ లైపోమా. మహిళలలో ఎక్కువగా రొమ్ములు, గర్భసంచిలో కణితులు ఏర్పడుతుంటాయి. ఇవి ఎక్కువ శాతం పైబ్రోమా బినైన్ ట్యూమర్స్ అయివుండవచ్చు. పేగులలో పాలిప్స్ అనే బినైన్ ట్యూమర్స్ ఏర్పడుతుంటాయి. వీటివల్ల శోషణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇతర వాటిల్లోనూ బినైన్ ట్యూమర్స్ ఏర్పడుతాయి. నరాల నుంచైతే న్యూరోమాస్ అని, రక్తం నుంచి ఏర్పడితే యాంజియోమాస్ అంటారు. ఎముకల నుంచి కూడా ఈ ట్యూమర్లు ఏర్పడుతాయి. అయితే ఈ ట్యూమర్లు సర్వసాధారణమే.
ప్ర: క్యాన్సర్ కణితులని ఏ సమయంలో అనుమానించాలి?
జ: ‘‘కొన్ని కణితులు వేగంగా పెరుగుతుంటాయి. వాటిని ముట్టుకున్నప్పుడు సాధారణంగా గట్టిగా ఉంటాయి. అంతేకాకుండా ఇన్‌ఫిల్‌ట్రేటివ్ అంటే చుట్టుపక్కన ఉండే వాటిలోకి సులభంగా చొచ్చుకుపోయేలా ఉంటాయి. అదేవిధంగా కొన్ని ట్యూమర్లు చిన్నవిగా ఉన్నప్పుడే శరీరంలోని మరోభాగానికి పాకుతాయి. వీటిని మెటాస్టేటిక్ ట్యూమర్లు అంటాం. ఈ రకమైన కణితులు శరీరంలో కనిపిస్తే క్యాన్సరేమోనని అనుమానించాలి’’
ప్ర: క్యాన్సర్ కాని కణితుల లక్షణాలు ఎలా ఉంటాయి?
జ : ఇవి చాలా నిదానంగా పెరుగుతాయి. సాధారణంగా వీటి నుంచి ఎలాంటి నొప్పి కలుగదు. వీటిని ముట్టి చూసినపుడు గట్టిగా ఉండవు. చుట్టు పక్కన ఉండేవాటిలోకి చొచ్చుకుపోవు. శరీరంలోని మరో భాగానికి పాకే విధంగా ఉండవు.
ప్ర: క్యాన్సర్ కాని కణితులకు చికిత్స అవసరమా?
జ: బినైన్ ట్యూమర్స్ చిన్నగా ఉన్నప్పుడు సాధారణంగా వాటికి చికిత్స అవసరం ఉండదు. కానీ.. అవి 5 సెం.మీ కన్నా పెద్దగా ఉన్నప్పుడు మాత్రం క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల కచ్చితంగా చిక్సిత చేయించుకోవాల్సి వస్తుంది.
మరిన్ని విషయాలకోసం ఈ కింది వీడియో చూసేయండి.