తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న బంద్

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ వివిధ రైతు సంఘాలిచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది

Updated : 08 Dec 2020 14:25 IST

ఎక్కడిక్కడే నిలిచిపోయిన బస్సులు

దుకాణాలు, వర్తక సమూకాలు స్వచ్ఛందంగా మూసివేత

హైదరాబాద్: నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ వివిధ రైతు సంఘాలిచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలకు మద్దతు తెలుపుతూ వివిధ రాజకీయ పార్టీలు, వ్యాపారసంఘాలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండలో వర్తక, వాణిజ్య సముదాయాలు తెరచుకోలేదు. నార్కట్‌పల్లి-అద్దంకి బైపాస్‌ రహదారిపై వామపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. పానగల్‌ బైపాస్‌ వద్ద నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిని నాయకులు దిగ్బంధించారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

భారత్‌ బంద్‌కు సంఘీభావంగా హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మాదాపూర్‌-రాయదుర్గం మెట్రోస్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. సాగు చట్టాలు రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఫోరం ఫర్‌ ఐటీ అసోసియేషన్‌ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. మంచిర్యాలలో  శ్రీరాంపూర్‌ సింగరేణి కార్మికులు రైతుల నిరసనకు మద్దతు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో ఎదుట ఎమ్మెల్యే చందర్‌ నిరసన తెలిపారు. కల్వకుర్తి డిపో ఎదుట ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, రైతు సంఘాల నేతలు నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ డిపో ఎదుట మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో ధర్నా నిర్వంచారు.

కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట వామపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని 10 డిపోల్లోని 840 బస్సులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వ్యాపార సంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట నిరసన వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. సాగు  చట్టాలను రద్దు చేయాలంటూ తిరుపతి బస్టాండ్‌ కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అయితే తిరుమల వెళ్లే బస్సులను బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ బంద్‌ తీవ్రత కనిపిస్తోంది. విజయనగరంలోని 4 డిపోల్లో 360 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. శ్రీకాకుళంలో 300 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి..
భారత్‌ బంద్‌: రోడ్డెక్కిన రైతులు.. నిలిచిన రైళ్లు

మోదీజీ మీ పెద్దమనసు చాటుకోండి: బాదల్‌

 






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని