Durgam Cheruvu: దుర్గం చెరువు పరిరక్షణకు ముగ్గురు సభ్యులతో కమిటీ: హైకోర్టు

నగరంలోని దుర్గం చెరువు పరిరక్షణకు హైకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

Updated : 22 Dec 2023 21:24 IST

హైదరాబాద్‌: నగరంలోని దుర్గం చెరువు పరిరక్షణకు హైకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. నాగ్‌పుర్‌లోని నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అతుల్‌ నారాయణ్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ప్రభుత్వం తరఫున ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శులను కమిటీ సభ్యులుగా నియమించింది. చెరువును పరిశీలించి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని కమిటీ కోరింది. 6 వారాల్లో నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. కమిటీకి పోలీసులు పూర్తిగా సహకరించాలని, కమిటీ సభ్యుల రవాణా ఖర్చులతో సహా అన్నీ ప్రభుత్వమే భరించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు.. కమిటీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దుర్గం చెరువు కలుషితం కావడంతో వందలాది చేపలు మృత్యువాత పడుతున్నాయని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. దీనిపై గత వారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. చెరువు పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని అడ్వొకేట్‌ కమిషన్‌గా న్యాయవాది వేదుల శ్రీనివాస్‌ను నియమించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కాలుష్యం లేని చెరువును భావితరాలకు అందించాలన్నదే తమ సంకల్పమని, దీనికి అందరూ సహకరించాలని చెబుతూ తదుపరి విచారణ వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని