Anand Mahindra: ‘టెంపుల్‌ ఆఫ్‌ టీ సర్వీస్‌’కు తప్పక వెళ్లాల్సిందే: ఆనంద్‌ మహీంద్రా

అమృత్‌సర్‌ (Amritsar) వెళ్లినప్పుడు గోల్డెన్‌ టెంపుల్‌తోపాటు తప్పకుండా బాబాజీ టెంపుల్‌ ఆఫ్‌ టీ సర్వీస్‌కు వెళ్తానని అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహాంద్రా (Anand Mahindra).

Updated : 24 Jul 2023 17:01 IST

ముంబయి: వృద్ధాప్యంలోనూ ఇతరులపై ఆధారపడకుండా.. తమకు చేతనైన పనిచేస్తూ.. పొట్టపోసుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల గురించిన ఎన్నో కథనాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటాయి. ఇలాంటి స్ఫూర్తిగాథలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పుడూ ముందే ఉంటారు. గతంలో తమిళనాడుకు చెందిన ఇడ్లీలు అమ్మే బామ్మకు సహాయం చేయడం నుంచి వ్యర్థాల నుంచి ఐరన్‌మ్యాన్‌ సూట్‌ తయారు చేసిన మణిపుర్‌ యువకుడి చదువునకు తోడ్పాటు అందిచడం వరకు ఎన్నో స్ఫూర్తిగాథలను మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 

తాజాగా ఓ పెద్ద చెట్టు కింద టీ అమ్ముకుంటున్న వృద్ధుడి వీడియోను మహీంద్రా ట్విటర్‌లో షేర్ చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన అజిత్‌సింగ్‌ అనే వ్యక్తి 40 ఏళ్లుగా ఓ పెద్ద చెట్టు తొర్రలో టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. స్థానికులు ఆయన్ను బాబాగా పిలుస్తారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు టీ విక్రయిస్తుంటాడని, బాబాజీ టీ ఎంతో బావుంటుందని ఓ కస్టమర్‌ చెప్పడం వీడియోలో చూడొచ్చు. ‘‘అమృత్‌సర్‌లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ సారి నేను అమృత్‌సర్‌కు వెళ్లినప్పుడు గోల్డెన్‌ టెంపుల్‌తోపాటు బాబాజీ ‘టెంపుల్‌ ఆఫ్‌ టీ సర్వీస్‌’కు కూడా తప్పక వెళ్తాను. 40 ఏళ్లుగా ఆయన టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయనను ఆదరిస్తున్న మన  హృదయాలు పెద్ద దేవాలయాలు’’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు. 

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అమృత్‌సర్‌ వెళ్లినప్పుడు తాము కూడా తప్పకుండా బాబాజీ టీ దుకాణానికి వెళ్తామని కామెంట్లు చేస్తున్నారు. అలాగే, ప్రధాని మోదీ.. మన్‌ కీ బాత్‌లో ఈ స్ఫూర్తిదాయక కథనం గురించి ప్రస్తావించాలని ఒక యూజర్‌ ట్వీట్ చేశాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని