Updated : 24 Jun 2021 13:40 IST

పరీక్షలపై ఇప్పటికిప్పుడే తేల్చండి: సుప్రీం

సుప్రీం కోర్టు

దిల్లీ: పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా అఫిడవిట్‌లో అది ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించే గదుల వివరాలు కూడా అఫిడవిట్‌లో ఎక్కడా లేవని.. ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని వ్యాఖ్యానించింది. కరోనా వేళ ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది కూర్చోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. 15 రోజుల ముందుగా టైం టేబుల్‌ ఇస్తామంటున్నారు..ఆ సమయం సరిపోతుందని ఎలా చెప్తారని ప్రశ్నించింది. రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూశాం కదా.. అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించింది.

‘‘ ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థులు ఎలా పరీక్ష రాయగలుగుతారు. వేలకొద్దీ పరీక్ష గదులను ఎలా అందుబాటులోకి తీసుకొచ్చి, సమన్వయం చేయగలుగుతారు. పరీక్ష నిర్వహించాము.. పని అయిపోయింది అనుకోలేము కదా. పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం చేయాలి, ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది.. ఇవేమీ మీ అఫిడవిట్లో కనిపించలేదు. రెండో దశ తీవ్రతను చూసి.. పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెపుతున్నా.. ఎందుకు ఇలా వ్యవహారిస్తున్నారు’’ అని సుప్రీం వ్యాఖ్యానించింది.  ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడింది. అవసరమైతే సీబీఎస్ఈ, యూజీసీ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాలు తీసుకోవాలని సూచించింది. గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికీ, పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది. కొంత సమయం ఇస్తే.. చర్చించి ప్రభుత్వం నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎక్కువ సమయం ఇవ్వడం కుదరదని, తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని, ఈ వ్యవహారం విద్యార్థులపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలని సుప్రీం పేర్కొంది. పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మూడో వేవ్ వస్తే అప్పుడు ఏం చేస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై విచారణను రేపే చేపట్టనున్నట్లు జస్టిస్‌ ఖన్వీల్‌కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం స్పష్టం చేసింది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని