Jagan: రైతులు, విద్యార్థుల కోసం ఎంతో చేశాం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో జగన్‌

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం జగన్‌ పాల్గొన్నారు. పంటలమార్పిడి, నూనె గింజలు, పప్పు దినుసుల ఉత్పత్తిలో

Published : 08 Aug 2022 02:12 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం జగన్‌ పాల్గొన్నారు. పంటలమార్పిడి, నూనె గింజలు, పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, జాతీయ విద్యావిధానం అమలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక పాలన వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను సీఎం జగన్‌ వివరించారు. ఏపీలో 62శాతం జనాభా వ్యవసాయ రంగంమీదే ఆధారపడి జీవిస్తున్నారని, రాష్ట్ర జీడీపీలో వ్యవసాయరంగం వాటా 35శాతంపైనే ఉందని తెలిపారు. వ్యవసాయరంగంలో ఉన్న రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా -పీఎం కిసాన్‌, ఉచిత పంటల బీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9గంటల పాటు ఉచిత విద్యుత్‌ తదితర పథకాలు, కార్యక్రమాలను రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. 

10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం..

రైతులకు మరింత అండగా నిలిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన, ధ్రువీకరించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నామన్నారు. డిజిటల్‌ టెక్నాలజీని విస్తృతంగా వాడుతూ మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజువారీగా ఆర్బీకేల స్థాయిలో సీఎం యాప్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాప్‌ బుకింగ్‌ కూడా చేస్తున్నామని, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ క్రాప్‌ బుకింగ్‌ దోహదపడుతోందని పేర్కొన్నారు. 

బడికెళ్లడం.. చదువుకోవడం చిన్నారుల హక్కుగా గుర్తించాం..

బడికెళ్లడం, చదువుకోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దీన్ని సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేశామని సీఎం పేర్కొన్నారు. బడి మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతో పాటు జీఈఆర్‌ నిష్పత్తిని పెంచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్‌ నిష్పత్తి 99.21శాతం కాగా, ఏపీలో ఇది 84.48శాతంగా ఉందన్నారు. తల్లిదండ్రుల పేదరికం పిల్లల చదువులకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తోందన్నారు. 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను కూడా పరిగణనలోకి తీసుకున్నామన్నారు.

అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టాం.. 

విద్యార్థులకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్‌ యాప్‌ కూడా అందిస్తున్నామని, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ కూడా ఇవ్వబోతున్నట్టు తెలిపారు. మనబడి నాడు-నేడు పథకం కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మొదటి విడత కింద ఇప్పటికే  15,715 స్కూళ్లను తీర్చిదిద్దామన్నారు. పౌరుల వద్దకే సేవలందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయన్నారు.  దీని వల్ల ఉపాధి కల్పించడమే కాకుండా, అవినీతి లేకుండా, పారదర్శకంగా సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. మరింత సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టామన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఒక నోట్‌ను కూడా సమావేశంలో సీఎం జగన్‌ సమర్పించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని