Andhra news: హైకోర్టు నిర్దేశించిన గడువులోగా రాజధాని నిర్మాణం అసాధ్యం: ఏపీ సర్కారు

హైకోర్టు సూచించిన గడువులోగా రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ఏపీ సర్కార్‌ స్పష్టం చేసింది.

Updated : 02 Apr 2022 21:36 IST

అమరావతి: హైకోర్టు నిర్దేశించిన గడువులోగా రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సీఎస్‌ సమీర్‌శర్మ ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 190 పేజీల అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించారు. అమరావతి రాజధాని కేసులో ఈనెల 3లోగా రైతులకు ఇచ్చిన స్థలాల్లో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. గడువు ముగుస్తుండటంతో శనివారం ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

‘‘మౌలిక వసతుల కల్పనకు సమయం పడుతుంది. నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసేందుకు కనీసం 6 నెలల నుంచి 60 నెలలు కావాలి. అమరావతి ప్రాంతం నుంచి నిర్మాణ కార్మికులు వెళ్లిపోయారు. వర్కర్లు, యంత్రాలను రప్పించేందుకే 2 నెలలు పడుతుంది. పనులు మొదలు పెట్టేందుకు 8 నెలల సమయం పడుతుంది. రహదారుల నిర్మాణానికి 16 నెలలు అవసరం. ఇక డ్రైనేజీ, నీటి సరఫరా, ఇతర పనులకు 36 నెలలు పడుతుంది. గతంలో రూ.42,231 కోట్లతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నాం. గత నెల 23న బ్యాంకర్లతో సీఆర్‌డీఏ సమావేశం అయింది. రాజధాని పనులకు రుణాలు ఇవ్వటంపై బ్యాంకులు స్పందించలేదు’’ అని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని