AP High Court: ఏపీ సీఐడీ కేసు.. ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు హైకోర్టు బెయిల్
జగజ్జననీ చిట్‌ఫండ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు.. తెదేపా నేత శ్రీనివాస్ (వాసు)కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అమరావతి: జగజ్జననీ చిట్‌ఫండ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు.. తెదేపా నేత శ్రీనివాస్ (వాసు)కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల క్రితం వాదనలు ముగియగా.. తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.
జగజ్జననీ చిట్‌ఫండ్ వ్యవహారంలో అప్పారావు, వాసులను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. చిట్‌ఫండ్ చట్టం ఈ కేసుకు వర్తించదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. డిపాజిట్‌దారుల ఫిర్యాదు లేకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
వాదనలు కొనసాగాయిలా..
బెయిలు మంజూరు చేయాలని కోరుతూ జగజ్జననీ సంస్థ ఎండీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు, డైరెక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం జరిగిన విచారణలో ఇరువైపు వాదనలు ముగిశాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని ఏ ఒక్క చందాదారుడూ(డిపాజిటర్) ఫిర్యాదు చేయలేదన్నారు. జగజ్జననీ చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ‘డిపాజిటర్ల చట్టం’ కింద సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదన్నారు. డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమైతేనే ఆ చట్టం వర్తిస్తుందన్నారు.
చిట్ నిర్వహణలో ఏవైనా లోపాలను చిట్ సహాయ రిజిస్ట్రార్ గుర్తిస్తే.. ఆ విషయాన్ని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దుకునేందుకు వీలు కల్పించాలన్నారు. ప్రస్తుత కేసులో అందుకు భిన్నంగా కాకినాడ సహాయ రిజిస్ట్రార్ వ్యవహరించారని.. నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారన్నారు. దీని వెనుక పిటిషనర్లను జైలుకు పంపాలనే దురుద్దేశం ఉందని చెప్పారు. గతంలో నిర్వహించిన తనిఖీలలో సొమ్ము చెల్లింపు తేదీల్లో తేడాలున్నాయని మాత్రమే గుర్తించారన్నారు. చిన్న లోపాలు చోటు చేసుకుంటే అవి చిట్ ఫండ్ చట్ట పరిధిలోకి వస్తాయన్నారు. ‘డిపాజిటర్ల చట్టం’ వర్తించదన్నారు. గతంలో విచారణ నిమిత్తం అధికారులు పిలిస్తే పిటిషనర్ వెళ్లి సహకరించారన్నారు.
అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సీఐడీ పట్టించుకోలేదన్నారు. పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్థనను దిగువ కోర్టు తోసిపుచ్చిందని తెలిపారు. రికార్డులన్నీ ఇప్పటికే చిట్ రిజిస్ట్రార్ల వద్ద ఉన్నాయన్నారు. దర్యాప్తు పేరుచెప్పి పిటిషనర్లను జైల్లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. ఐపీసీ సెక్షన్ 409, డిపాజిటర్ల చట్టం సెక్షన్ 5 ఈ కేసుకు వర్తించవన్నారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. దర్యాప్తు కొనసాగుతోందని.. బెయిలు ఇవ్వొద్దని కోరారు. చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సొమ్ము తిరిగి చెల్లింపుపై ఏ ఒక్క చందాదారుడికీ అభ్యంతరం లేనప్పుడు డిపాజిటర్ల చట్టం ఏవిధంగా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఏజీ బదులిస్తూ.. చందాదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులేట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. నేడు ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు బెయిల్ మంజూరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..