భారత సైన్యంలో కొత్త వాహనాలు..!

పదాతి దళాలను వేగంగా యుద్ధభూమికి తరలించడం సహా శత్రు ట్యాంకులను ధ్వంసం చేయగలిగే అత్యాధునిక వాహనాలను సమకూర్చుకోవాలని భారత సైన్యం భావిస్తోంది.

Updated : 25 Jun 2021 04:37 IST

దిల్లీ: పదాతి దళాలను వేగంగా యుద్ధభూమికి తరలించడం సహా శత్రు ట్యాంకులను ధ్వంసం చేయగలిగే అత్యాధునిక వాహనాలను సమకూర్చుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. అందులో భాగంగా 1980 నుంచి వినియోగిస్తున్న వాహనాల స్థానంలో కొత్త వాహనాలను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు రిక్వెస్ట్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐ)ను జారీ చేసినట్లు ఓ సీనియర్‌ సైనికాధికారి గురువారం వెల్లడించారు. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. తూర్పు లద్దాఖ్‌లాంటి ఎత్తైన ప్రదేశాలకు బలగాలను వేగంగా తరలించేందుకు అధునాతన ఆయుధాలతో కూడిన 1750 పదాతిదళ పోరాట వాహనాలు, తక్కువ బరువున్న 350 ట్యాంకర్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ‘మేకిన్‌ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ కింద ఈ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సైన్యం ప్రతిపాదనలకు అనుగుణంగా వాహనాలను సరఫరా చేసేందుకు ఆసక్తి ఉన్న తయారీ సంస్థలు వారంలోగా తమ అభిప్రాయాన్ని తెలుపాలని సూచించారు. ఈ వాహనాలను సైన్యం మూడు దశల్లో స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. విదేశీ సంస్థలతో కలిసి వాహనాల తయారీ చేపట్టవచ్చన్నారు. అయితే రెండేళ్లలో ప్రతిపాదిత వాహనాలను పూర్తిస్థాయిలో అందజేయాల్సి ఉంటుందన్నారు. అధునాతన పదాతిదళ వాహనాల కొనుగోలుకు రక్షణ శాఖ 2009లోనే నిర్ణయించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా లద్దాఖ్‌ వద్ద చైనాతో నెలకొన్న సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని