Kamareddy: కామారెడ్డిలో కొనసాగుతున్న బంద్‌.. పలువురు నాయకుల అరెస్టు

పట్టణ నూతన మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ కామారెడ్డిలో రైతులు చేపట్టిన బంద్‌ కొనసాగుతోంది. ఉదయ నుంచి ఆయా పక్షాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

Updated : 06 Jan 2023 15:43 IST

కామారెడ్డి పట్టణం: మాస్టర్‌ ప్లాన్‌లో సాగు భూములను పరిశ్రమల జోన్‌ నుంచి తొలగించాలంటూ డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌ ముట్టడిలో భాగంగా రైతుల వద్దకు వచ్చి వినతి పత్రం తీసుకోని కలెక్టర్‌ వైఖరిపై ఆందోళన బాట పట్టారు. ఉదయం నుంచి ఆయా పక్షాల నాయకులను అరెస్టు చేశారు.

భాజపా అసెంబ్లీ ఇన్‌ఛార్జి వెంకటరమణారెడ్డిని రాజంపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని ఇందిరా చౌక్‌ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జిల్లా కేంద్రంలో వ్యాపార దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేశారు. పోలీసులు వాహనాల్లో తిరుగుతూ ర్యాలీ నిర్వహించే వారిని అరెస్టు చేస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ పలు అభ్యంతరాలకు ఈనెల 11 వ తేదీ వరకు అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పటికే రైతులు 550 మంది కోర్టు నుంచి నోటీసుల పంపించారు. మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు సంతకాల సేకరణ చేసిన లేఖను గవర్నర్‌,  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పురపాలక మంత్రికి  పంపించారు.

కాగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై గురువారం మంత్రి కేటీఆర్‌ స్పందించిన విషయం తెలిసిందే. ప్రజా ఆమోద మాస్టర్‌ ప్లాన్‌నే రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం మాస్టర్‌ ప్లాన్‌ డ్రాప్ట్‌ మాత్రమేనని.. ఇది తుది జాబితా కాదని రైతులకు ఎందుకు అవగాహన కల్పించలేదని అధికారులను ప్రశ్నించారు. మాస్టర్‌ ప్లాన్‌ వివాదం కామారెడ్డిలో రాజకీయంగా దుమారం రేపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని