Unicef: కరోనా సంక్షోభంతో పేదరికంలోకి 10 కోట్ల మంది చిన్నారులు!

కరోనా మహమ్మారి చిన్నారులపై పెను ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్‌ ఫండ్‌(యూనిసెఫ్‌) వెల్లడించింది. 75ఏళ్ల చరిత్రలో చిన్నారుల విషయంలో సాధించిన పురోగతికి కరోనా రూపంలో ముప్పు వాటిల్లిందని యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రిట్టా ఫోర్‌ తెలిపారు. ‘‘చిన్నారుల్లో ఆకలి,  

Updated : 10 Dec 2021 05:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి చిన్నారులపై పెను ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్‌ ఫండ్‌ (యూనిసెఫ్‌) వెల్లడించింది. 75 ఏళ్ల చరిత్రలో చిన్నారుల విషయంలో సాధించిన పురోగతికి కరోనా రూపంలో ముప్పు వాటిల్లిందని యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రిట్టా ఫోర్‌ తెలిపారు. ‘‘చిన్నారుల్లో ఆకలి, నిరక్షరాస్యత, వేధింపులు, పేదరికం, బలవంతపు బాల్యవివాహాలు పెరుగుతున్నాయి. ఆరోగ్య భద్రత, వ్యాక్సిన్లు, తగినంత ఆహారం లభించే చిన్నారుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. పురోగతిని ఆశిస్తున్న మనం.. తిరిగి వెనక్కి వెళ్తున్నాం’’ అని హెన్రిట్టా ఫోర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 11 నాటికి యూనిసెఫ్‌ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ‘చిన్నారులపై కరోనా ప్రభావం’ పేరుతో నివేదిక రూపొందించింది.

పేదరికంలోకి మరో 10కోట్ల మంది చిన్నారులు

యూనిసెఫ్‌ నివేదిక ప్రకారం.. కరోనా సంక్షోభంతో మరో 10 కోట్ల మంది చిన్నారులు పేదరికంలోనే మగ్గిపోనున్నారు. 2019 నుంచి పేదరికంలో ఉన్న చిన్నారులు 10 శాతం పెరిగారు. అంటే గతేడాది మార్చి నెల నుంచి ప్రతి సెకన్‌కు ఇద్దరు చిన్నారులు చొప్పున పేదరికంలోకి జారుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితి నుంచి పురోగతి సాధించాలంటే కనీసం ఎనిమిదేళ్లు పడుతుందని యూనిసెఫ్‌ అంచనా వేసింది.

యూనిసెఫ్‌ నివేదికలో మరికొన్ని ముఖ్యమైన అంశాలు..

* కరోనా తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలైంది. దీంతో 80 శాతం పాఠశాలలు మూతపడ్డాయి. ఆ సమయంలో ప్రపంచంలోని 160 కోట్ల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. 

* 10 నుంచి 19 ఏళ్ల వయసున్న వారిలో 13 శాతం మంది మానసిక ఆరోగ్యంపై కరోనా ప్రభావం చూపింది. కాగా.. అక్టోబర్‌ 2020 నాటికి ప్రపంచంలో 93 శాతం మానసిక ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి.

* కరోనా సృష్టించిన సంక్షోభం కారణంగా ఈ దశాబ్దం ముగిసే నాటికి కనీసం కోటి మంది చిన్నారులకు బలవంతపు బాల్యవివాహాలు జరిగే అవకాశముందని యూనిసెఫ్‌ అంచనా.

* బాలకార్మికుల సంఖ్య మొత్తంగా 16 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలో 84 లక్షల మంది చిన్నారులు కార్మికులుగా మారారు. 2022 చివరికి మరో 90 లక్షల మంది బాలకార్మికులుగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పేదరికం మరింత పెరుగుతుంది.

* ప్రస్తుతం 5 కోట్ల మంది చిన్నారులు పోషకాహార లోపం సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, కరోనా మహమ్మారి చిన్నారుల భోజనం, పోషకాలపై ప్రభావం చూపిస్తుండంటతో 2022 నాటికి మరో 90 లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడతారు.

కరోనా కాకుండా ఇతర రూపాల్లోనూ చిన్నారులకు ముప్పు పొంచి ఉందని యూనిసెఫ్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 42.6కోట్ల మంది చిన్నారులు హింసాత్మక ప్రాంతాల్లో జీవిస్తున్నారని, వంద కోట్ల మంది చిన్నారులు (ప్రపంచంలోని చిన్నారుల జనాభాలో సగం మంది) వాతావరణ మార్పుల వల్ల ప్రమాదంలో పడ్డ దేశాల్లో నివసిస్తున్నారని వెల్లడించింది.

ఇన్ని సమస్యల నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలని యూనిసెఫ్‌ పిలుపునిస్తూ పలు సూచనలు చేసింది.

* సామాజిక భద్రతపై పెట్టుబడులు పెట్టాలి.

కరోనాను పూర్తిగా నిర్మూలించి.. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై తిరిగి దృష్టి సారించాలి.

* ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య, రక్షణ, మానసిక ఆరోగ్యం కల్పించేందుకు పాటుపడాలి.

భవిష్యత్తులో వచ్చే విపత్తులు, సంక్షోభాలు, వాతావారణ మార్పుల నుంచి చిన్నారులను కాపాడేందుకు సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలి. ఇందుకు అయ్యే వ్యయాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలి.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని