పిల్లలకు జ్వరం: ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఏ కుటుంబానికైనా పిల్లలే పంచప్రాణాలు.. ఇంట్లో పెద్దలంతా పిల్లలని కంటిపాపల్లా చూసుకోవడం కూడా సర్వసాధారణం. అందుకే పిల్లలకు ఏ చిన్న సమస్య వచ్చినా...

Published : 22 May 2021 17:47 IST

డా. రేవంత్‌, పీడియాట్రిక్‌ ఇంటెన్సివిస్ట్‌

ఏ కుటుంబానికైనా పిల్లలే పంచప్రాణాలు.. ఇంట్లో పెద్దలంతా పిల్లలని కంటిపాపల్లా చూసుకోవడం కూడా సర్వసాధారణం. అందుకే పిల్లలకు ఏ చిన్న సమస్య వచ్చినా... ఇంటిల్లిపాది తల్లడిల్లిపోతారు. పిల్లలో వచ్చే జ్వరం.. ఇటు పిల్లలని.. అటు పెద్దల్ని.. ఇద్దరినీ ఇబ్బంది పెట్టే సమస్య. పిల్లలకు కాస్త ఒళ్లు వెచ్చ చేసిందంటే పెద్దలకు కంటిమీద కునుకు ఉండదు. వేడి ఎంత ఉందో చెక్‌చేయడం, ఏమి తినిపించాలో ఆలోచించడం... ఇలా పిల్లలకు జ్వరం తగ్గేంత వరకు పెద్దలకు నిద్రపట్టదు.  ఈ నేపథ్యంలో పిల్లల్లో జ్వరం గురించి డాక్టర్లు ఏమంటున్నారంటే...

చిన్న పిల్లల్లో జ్వరాలకు  కారణమేంటి?

90 శాతం పిల్లల్లో జ్వరాలకు వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ కారణం. అది కాకుండా బ్యాక్టీరియల్‌, ప్యారాసైట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉండొచ్చు. ఇవి కాస్త ప్రమాదకరమైనవి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సాధారణంగా పిల్లలో 3-4 రోజుల పాటు ఉంటుంది. తరువాత అవి తగ్గిపోతుంది. వీటికి పెద్దగా మందులు వేయాల్సిన అవసరం ఉండదు. ఇన్‌ఫెక్షన్‌ కాకుండా కొన్నిసార్లు బ్లడ్‌ క్యానర్స్‌, కీళ్లవాతమైన జబ్బులు.. ఇవి కూడా జ్వరానికి కారణమవుతాయి. ఎండలో ఎక్కువ సేపు ఆడుకున్నా, బెడ్‌షీట్స్‌ కప్పుకొని పడుకున్నా.. కొంత మంది పిల్లల్లో ఒళ్లు వెచ్చబడుతుంది.. అటువంటి వారికి ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. 

పిల్లల్లో జ్వరాల లక్షణాలు ఎలా ఉంటాయి?

పిల్లల్లో జ్వరం వచ్చిందంటే శరీరంలో ఇంకా ఏమైనా వ్యాధులున్నాయా? ఇన్ఫెక్షన్లు ఉన్నాయా అనేవి చూసుకోవాలి. వాటికి సంబంధించి కొన్ని లక్షణాలుంటాయి. జ్వరం ఉన్న పిల్లలకు చలి, వణుకు రావొచ్చు, చెమట పట్టొచ్చు. ఉదాహరణకు నిమ్ము ఉన్నట్లేతే ఆయాసం, దగ్గు రావొచ్చు. వాంతులు, తలనొప్పి, ఫిట్స్, మగతగా పడుకొని ఉండటం.. ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇలా కాకుండా విరోచనాలు అవుతున్నా.. విరోచనాల్లో రక్తం వస్తున్నా, వాంతులు, కడుపు నొప్పి.. వీటిని డయేరియా అంటాం. మూత్ర పిండాల సమస్య వచ్చినప్పుడు మూత్రం ఎక్కువగా పోవడం,  అప్పుడు మంటగా ఉండటం..  ఈ లక్షణాలు ఉన్నప్పుడు కిడ్నికి ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు భావించాలి.

పిల్లల్లో అన్ని జ్వరాలు ప్రమాదకరమేనా?

సాధారణంగా పిల్లల్లో  90 శాతం వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ జర్వాలే వస్తాయి. ఇవి అంత ప్రమాదకరమైనవి కావు.  మిగిలిన 10 శాతం మంది పిల్లల్లో  బ్యాక్టీరియల్‌, ప్యారాసైట్‌ ఇన్‌ఫెక్షన్‌ బ్లడ్‌ క్యానర్స్ ఉండొచ్చు. అవికాస్త ప్రమాదకరమైనవి. 90 శాతం పిల్లల వరకూ ఈ జ్వరాలు ప్రమాదకరం కాదు. వైరల్‌ జ్వరం లేని వారిని వెంటనే గుర్తించి చికిత్స చేయించుకుంటే మిగతా జ్వరం కూడా తేలికగా అరికటొచ్చు. 

జ్వరాల వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుందా?

చాలా మందికి ఈ అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. మెదడు వాపు లక్షణాలు ఉంటే, మెదడు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సాధారణంగా వచ్చే వైరల్‌ జ్వరాల్లో ఇలా మెదడు దెబ్బతినే అవకాశాలు తక్కువ. కొంతమంది పిల్లలకు ఫిట్స్‌ రావొచ్చు. ఫిట్స్‌ ఎక్కువ సేపు వచ్చే వారిలో మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతే కానీ సాధారణంగా వచ్చే జ్వరాల్లో మెదడు దెబ్బతినడం, లేదా దానిపై ప్రభావం చూపడమనేది చాలా తక్కువ.

జ్వరంతో ఫిట్స్‌ రావడం ప్రమాదకరమా?

సాధారణ ఫిట్స్‌ అయితే ప్రమాదకరం కాదు. వీటి వల్ల పిల్లల్లో ఎదుగుదల్లో వచ్చే లోపాలు కానీ, మెదడు పై ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువ. వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మెదడు వాపు వ్యాధి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వాటిని గుర్తించి తగిన చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది.

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు?

జ్వరం వస్తే.. పిల్లలు ముఖ్యంగా డిహైడ్రేషన్‌కు గురి అవుతుంటారు. శరీరం నుంచి వాటర్‌ అనేది వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వారితో నీరు తాగించాలి. తేలికపాటి ఆహారం పెట్టాలి ఎందుకుంటే కొంత మంది పిల్లలకు ఆహారమనేది అరగకపోవచ్చు. అవసరాన్ని బట్టి మందులు వేయడం, డాక్టర్‌ని సంప్రదించడం చేయాలి.

ఏమి చేయకూడదంటే..

* సాధారణంగా తల్లితండ్రులు జ్వరం రాగానే.దాన్ని తగ్గించేందుకు తడిబట్ట వేసి తుడుస్తుంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు. దాని వల్ల ఇంకా వణుకు ఎక్కువై పిల్లాడు ఇబ్బంది పడతాడు. ఒకవేళ చేయాలి అనుకుంటే గోరువెచ్చటి నీటితో తడిబట్ట పెట్టి తుడవచ్చు. 
* ఇవి తినకూడదు.. అవి తినకూడదు అనే నియమాలు పత్యం పెట్టకూడదు.
* యాంటిబయోటిక్‌ మందులు ఇస్తుంటారు. అలా చేయకూడదు.

పిల్లల్లో జ్వరానికి చికిత్స ఎలా ఉంటుంది?

జ. ముందుగా అది ఎలాంటి జ్వరమో తెలుసుకోవాలి. అది నార్మల్‌వైరల్‌ ఇన్ఫెక్షన్‌ జ్వరమా? శరీరంలో ఏ భాగంలో ఇన్ఫెక్షన్‌ ఉందో తెలుసుకోవాలి.. మెదడు అంటే మెదడు వాపుకి సంబంధించి లక్షణాలు ఉన్నాయా? కిడ్నీ అంటే కిడ్నీ  ఇన్ఫెక్షన్‌ ఉన్నాయా అని పరీక్షిస్తాం. ఒక్కోసారి పరీక్షలు చేసినా  ఇన్ఫెక్షన్‌ ఎక్కడ ఉందో తెలియకపోవచ్చు. అలాంటి సమయాల్లోనే బ్లడ్‌ టెస్ట్‌ సూచిస్తాం. బ్లడ్‌ టెస్ట్‌లో ప్రధానంగా చూసుకునేది రక్తకణాలు ఎలా ఉన్నాయి. డెంగీ లాంటి జబ్బుల్లో రక్త కణాలు తగ్గిపోతుంటాయి. ఇంకా అలాంటివి కాకుండా మలేరియా, టైఫాయిడ్‌కి బ్లడ్‌ టెస్ట్‌ చేస్తుంటాం. ఇప్పుడీ కొవిడ్‌ కాలంలో లక్షణాల బట్టి కొవిడ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని