Viveka Murder case: జగన్‌ సలహాదారు అజేయకల్లం తీరుపై సీబీఐ అసహనం

సీఎం జగన్‌ సలహాదారు అజేయకల్లం పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.

Updated : 16 Sep 2023 17:21 IST

హైదరాబాద్‌: సీఎం జగన్‌ సలహాదారు అజేయకల్లం పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. వివేకా కేసులో తన వాంగ్మూలం వక్రీకరించారని అజేయకల్లం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌ను భారతి మేడపైకి పిలిచి ఏదో చెప్పారని తాను చెప్పినట్టు తప్పుగా సీబీఐ చెప్పిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ అజేయకల్లం విచారణ ఆడియో రికార్డింగ్‌ ను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించింది. ఆయన తీరుపై సీబీఐ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. 

‘‘ప్రస్తుతం వాంగ్మూలం నమోదు వేళ అజేయకల్లం సీఎం ప్రధాన సలహాదారుగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వంతో అనుబంధాన్ని అజేయకల్లం కూడా పిటిషన్‌లో అంగీకరించారు. ఆయన ప్రభావితమైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పిటిషన్‌లో అజేయకల్లం పేర్కొన్న అంశాలు తర్వాత వచ్చిన ఆలోచనలే. అందుకే వాంగ్మూలం వెనక్కి తీసుకుంటున్నారు. తన వాంగ్మూలంతో కొందరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆరోపణలు ప్రేరేపితం, కల్పితం. వివేకా హత్యకేసులో స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు చేశాం. అజేయకల్లంతో పాటు పలువురు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశాం. వివేకా హత్యకేసులో అమాయకులను ఇరికించేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు.  వివేకా హత్యకేసులో దర్యాప్తు ముగిసింది. అజేయకల్లం అంగీకారంతోనే ఆయన ఇంట్లోనే ఏప్రిల్‌ 24న వాంగ్మూలం నమోదు చేశాం. ఆయన్ను సాక్షిగా విచారణ జరిపాయం. చట్టప్రకారం వాంగ్మూలంనమోదు చేసి చదివి వినిపించాం. ఆయన చెప్పిన ప్రతిఅక్షరం నమోదు చేశాం. అందువల్ల ఆయన పిటిషన్ విచారణార్హం కాదు’’ అని సీబీఐ కౌంటరు పిటిషన్‌ దాఖలు చేసింది.

సీబీఐ ప్రతిష్ట, కేసు ప్రాసిక్యూషన్‌ను దెబ్బతీసే ప్రయత్నం.. 

‘‘వాంగ్మూలంలో వాస్తవాలు నమోదు చేసినట్టు అజేయకల్లం సంతృప్తి చెందారు. ఐఏఎస్‌గా రిటైరైన వ్యక్తికి సీఆర్‌పీసీ 161 వాంగ్మూలం ఉద్దేశమేంటో తెలుసు. దర్యాప్తు అధికారిపై ఆరోపణలు అబద్ధం. కేసు ప్రాసిక్యూషన్‌ దెబ్బతీసే దురుద్దేశంతోనే పిటిషన్‌ వేశారు. ఇతర సాక్షుల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రయత్నిస్తున్నారు. మాజీ సీనియర్‌ అధికారిగా దర్యాప్తు, న్యాయవ్యవస్థపై ఆయనకు విశ్వాసం ఉండాలి. న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మాజీ సీనియర్‌ అధికారి నుంచి ఇలాంటి ఆరోపణలు ఊహించలేదు. సీబీఐ ప్రతిష్ట, కేసు ప్రాసిక్యూషన్‌ను దెబ్బతీసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

ట్రయల్‌ సమయంలో కోర్టులో అజేయకల్లం ఏం చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు. ట్రయల్‌కు ముందే ఇలాంటి ఆరోపణలతో పిటిషన్ వేసేందుకు ఇది తగిన సమయం కాదు. ట్రయల్‌ సమయంలో కల్లంను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయాల్సిన అవసరం ఉంది. ధిక్కార స్వభావానికి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. తన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డుల నుంచి తొలగించాలనడం ప్రాసిక్యూషన్ ను పక్కదారి పట్టించడమే. విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారే వెనక్కి తగ్గితే మిగతా సామాన్య సాక్షుల పరిస్థితేంటి?. నిందితుల ప్రభావమున్న ప్రాంతానికి చెందిన సాధారణ సాక్షుల పరిస్థితి ఏమిటి?. ట్రయల్ కు ముందే రాజ్యంగ కోర్టుల్లో సాక్షులు వెనక్కి తగ్గితే క్రిమినల్ జస్టిస్ సిస్టం అపహాస్యమవుతుంది’’అని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని