CBI: శ్రీనివాసరావుతో లావాదేవీలపై.. మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రను ప్రశ్నించిన సీబీఐ

దిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, తెరాస రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను సీబీఐ అధికారులు దాదాపు 8గంటల పాటు ప్రశ్నించారు.

Published : 01 Dec 2022 20:50 IST

దిల్లీ: దిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, తెరాస రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను సీబీఐ అధికారులు దాదాపు 8గంటల పాటు విచారించారు. దిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు విచారణకు హాజరయ్యారు. శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అతడితో ఏయే అంశాలపై చర్చలు జరిపారని ప్రశ్నించారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామని విచారణ అనంతరం గంగుల కమలాకర్‌, వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తమను మళ్లీ విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదని స్పష్టం చేశారు. 

‘‘మేం చెప్పిన అంశాలను రికార్డు చేసుకున్నారు. సీబీఐ అధికారుల దగ్గర ఉన్న సమాచారాన్ని, మేం ఇచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకున్నారు. నిందితుడు శ్రీనివాసరావును కూడా మా ముందుంచి పలు ప్రశ్నలు అడిగారు. ఇదే చివరి విచారణ, మళ్లీ విచారణ అవసరం లేదని చెప్పారు. మేం ఇచ్చిన సమాధానాలతో సీబీఐ అధికారులు సంతృప్తి చెందారు. మాతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని శ్రీనివాస్‌ అంగీకరించారు. మేం ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై సంతకాలు తీసుకున్నారు’’ అని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

‘‘నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ను మా ఎదురుగా కూర్చోబెట్టి విచారణ చేశారు. సీబీఐ అధికారులకు అన్ని అంశాలు వివరించాం.. అన్ని విధాలా సీబీఐ అధికారులకు సహకరించాం. శ్రీనివాసరావు గోల్డ్‌ తనే కొనుక్కున్నాడు. ఇంతటితో ఈ అంశం పూర్తయ్యింది. కొందరు మాపై ఆరోపణలు చేయించారు. శ్రీనివాసరావును కాపు సమ్మేళనంలో మాత్రమే కలిశాం’’ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని