Andhra News: ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.4,42,442 కోట్లు: కేంద్రం

2019తో పోలిస్తే ఏపీ ప్రభుత్వ అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Updated : 07 Feb 2023 16:29 IST

దిల్లీ: పార్లమెంటు సాక్షిగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది. 2019తో పోలిస్తే ఏపీ అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని కేంద్రం వెల్లడించిది. ఈ మేరకు రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘2019లో రాష్ట్ర అప్పులు ₹2,64,451 కోట్లు ఉండగా.. 2020లో ₹3,07,671 కోట్లు, 2021లో ₹3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత ₹3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు ₹4,42,442 కోట్లుగా ఉంది. ఏటా సుమారు ₹45వేల కోట్లు అప్పులు చేస్తోంది’’ అని పంకజ్ చౌదరి వెల్లడించారు.

ఎడాపెడా.. ఎటు చూసినా అప్పులే..

రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులు తారస్థాయికి చేరుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం రూ.55వేల కోట్లు దాటింది. వివిధ కారణాలు చెప్పి సగటున రోజూ రూ.205కోట్లు ఆర్థిక శాఖ అప్పు చేస్తోంది. ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల్లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.55,555 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నెలకు సగటున చేసిన అప్పు రూ.6,172 కోట్లుగా తేలింది.

వివిధ మార్గాల్లో దొరికిన చోటల్లా  ప్రభుత్వం అప్పులు చేసేస్తోంది. గడిచిన 3ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రుణం కేవలం రూ.1,34,453 కోట్లు మాత్రమేనని ఆర్థికశాఖ చెప్పుకొస్తోంది. గడిచిన 9నెలలుగా ప్రభుత్వం చేసిన రుణం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు మించి రూ.55,555 కోట్లకు చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల విషయాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం 2022 మార్చి నాటికి ఏపీ చేసిన రుణం రూ.3,98,903 కోట్లు మాత్రమేనని చెప్పుకొస్తోంది. అయితే, హాఫ్ బడ్జెట్‌ బారోయింగ్స్‌ ద్వారా తీసుకున్న రుణాన్ని బహిర్గత పర్చాలని చేస్తున్న డిమాండ్‌పై ప్రభుత్వం డొంక తిరుగుడు సమాధానమిస్తోంది. మొత్తానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలు మొత్తం రూ.55వేల కోట్లకు చేరిపోవడంతో తదుపరి రుణాలు తీసుకునే అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని