మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సహకరించండి: ప్రధానికి రేవంత్‌రెడ్డి వినతి

 రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన మోదీకి 11 అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.

Updated : 05 Mar 2024 20:17 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీళ్లు అందించేందుకు కేంద్ర జలజీవన్‌ మిషన్‌ నిధులు కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. మరో 29 మంది ఐపీఎస్‌లను రాష్ట్రానికి కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయడంతో పాటు మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సహకరించాలని కోరారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన మోదీకి 11 అంశాలపై సీఎం వినతిపత్రం అందజేశారు.

మహారాష్ట్ర విషయంలో జోక్యం చేసుకోవాలి..

ఎన్టీపీసీలో 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందన్న సీఎం.. మిగిలిన 2,400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భూ సేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్‌ ఫారెస్ట్‌ ఏరియా మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సహకరించాలన్నారు. దీనికోసం 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌ తయారీకి రూ.3కోట్లు మంజూరు చేసిందని, రూ.7,700 కోట్ల ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలన్నారు. ఈ కారిడార్‌తో శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్‌ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. దక్షిణ తెలంగాణ వైపు రవాణా మార్గాలు విస్తరిస్తాయని వివరించారు.

29మంది ఐపీఎస్‌లను కేటాయించండి..

తెలంగాణలో పెరిగిన జిల్లాలు, పోలీస్‌ కమిషనరేట్లకు అనుగుణంగా ఐపీఎస్‌ క్యాడర్‌ను అత్యవసరంగా సమీక్షించాలని కోరారు. రాష్ట్రానికి వెంటనే మరో 29 పోస్టులు ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌- రామగుండం, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ రహదారిపై రక్షణశాఖ భూముల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు ప్రధానికి ధన్యావాదాలు తెలిపారు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్‌ ఏరియాలో 178 ఎకరాలతో పాటు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్‌ నిర్మాణం కోసం పొన్నాల గ్రామ సమీపంలో 1,350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్‌ ల్యాండ్స్‌ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. శామీర్‌పేటలోని 1,038 ఎకరాల ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ లీజు గడువు ముగిసినందున పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఒక ఐఐఎం నెలకొల్పాలని, అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని ప్రధానికి వివరించారు.

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. కల్వకుర్తి-కొల్లాపూర్‌, గౌరెల్లి -వలిగొండ, తొర్రూర్‌- నెహ్రూనగర్‌, నెహ్రూనగర్‌-కొత్తగూడెం, జగిత్యాల-కరీంనగర్‌ ఫోర్‌ లేన్‌, జడ్చర్ల-మరికల్‌ ఫోర్‌ లేన్‌, మరికల్‌ -డియాసాగర్‌ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.  తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని