
TS News: సికింద్రాబాద్ గాంధీ, ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కరోనా కలకలం
హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపింది. వైద్యులు, నర్సులు, పీజీలు, హౌస్ సర్జన్లతో పాటు పలువురు వైద్య విద్యార్థులకు, ఇతర సిబ్బందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఆసుపత్రిలో ప్రస్తుతం 139మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వీరిలో 35మంది గర్భిణులు కూడా ఉన్నారని వెల్లడించారు. కరోనా సోకిన వైద్య సిబ్బందిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యం అందించనున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో ఇన్ పేషెంట్లుగా ఉన్న 57 మంది, 9మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయిస్తున్నట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమా శంకర్ వెల్లడించారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు.