SBI బ్రాంచీలు.. సగం మంది ఉద్యోగులతోనే

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్‌ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్యోగులు

Updated : 21 Apr 2021 17:11 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్‌ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీంతో బ్యాంకు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రేపటి నుంచి ఈ నెల 30 వరకు తమ బ్రాంచీల్లో సగం మంది ఉద్యోగులతో విధులు నిర్వహించనున్నట్లు ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓం ప్రకాశ్ మిశ్రా వెల్లడించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌బీఐకి చెందిన బ్రాంచీల్లో వందల మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొలి దశలో 2000మందికి పైగా ఎస్‌బీఐ ఉద్యోగులు కరోనా బారినపడగా.. రెండో దశలో ఇప్పటివరకు 600 మందికి వైరస్‌ సోకింది. ఖాతాదారులతో నేరుగా సంబంధాలున్న ఉద్యోగులు, లోన్‌ ప్రాసెసింగ్‌ విభాగం సిబ్బంది కొవిడ్‌ బారినపడ్డారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా డిజిటల్‌ సేవలకు ప్రాధాన్యమివ్వాలని మిశ్రా ఈ సందర్భంగా ఖాతాదారులను కోరారు. అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని కోరారు. సాధారణ ఉష్ణోగ్రత కలిగి మాస్క్‌లు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. 

ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబరు..

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ సర్కిల్‌లోని కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా హెల్ప్‌లైన్‌ నంబరు 040-23466233ను ఏర్పాటుచేసినట్లు మిశ్రా వెల్లడించారు. బ్యాంకు పనివేళల్లో ఈ నంబరు పనిచేస్తుందని తెలిపారు. బ్రాంచీలు తెరిచి ఉన్నాయా లేదా అనేది తెలుసుకునేందుకు, ఇతర సందేహాల కోసం కస్టమర్లు ఈ నంబరుకు ఫోన్‌ చేయొచ్చని పేర్కొన్నారు. అంతేగాక, హైదరాబాద్‌ కోఠి, సికింద్రాబాద్‌ ఎస్‌బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు మిశ్రా వెల్లడించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని