Cyclone Gulab: తీరం దాటిన గులాబ్‌ తుపాను

గులాబ్‌ తుపాను తీరం దాటింది. మరో 5 గంటల్లో అల్పపీడనంగా మరి ఇది బలహీనంగా మారనుంది. 

Updated : 27 Sep 2021 00:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గులాబ్‌ తుపాను తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల మధ్య తుపాన్‌ తీరం దాటినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ పేర్కొన్నారు. మరో 5 గంటల్లో ఈ తుపాను తీవ్ర అల్పపీడనంగా మారి బలహీన పడనుంది. మరోవైపు తుపాను ప్రభావంతో విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి.  శ్రీకాకుళంలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎక్కువ నష్టం చేకూరనట్లు కలెక్టర్‌ తెలిపారు. నష్టాల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోయినట్లు తెలిపారు. దీంతో విద్యుత్‌ సరఫరాకు ఆంతరాయం ఏర్పడిందన్నారు. శ్రీకాకుళంలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అన్నిశాఖల అధికారులు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు నిరంతరం పనిచేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మరోవైపు తుపాన్‌ ప్రభావంతో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకుచేరుకున్నారు. ఇంకోకరి కోసం గాలింపు చేపట్టారు. గల్లంతైన మత్స్యకారులు వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వాసులుగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా కంట్రోల్‌ రూమ్‌కు తెలపాలని సూచించారు. సహాయం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌: 08942240557, జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌: 6309990933 కు సమాచారం అందించాలని కలెక్టర్‌ సూచించారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని