Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు.

Published : 24 Oct 2022 12:30 IST

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని.. ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 

భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీనివాస దీక్షితులు చెప్పారు. స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీకృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించినట్లు వివరించారు. 

సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఆస్థానంలో పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌ స్వామి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తితిదే బోర్డు సభ్యులు మారుతీ ప్రసాద్‌, దిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డీఎల్వో రెడ్డప్పరెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్‌బాబు, పేష్కార్‌ శ్రీహరి, ముఖ్య అర్చకులు కిరణ్‌ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని