Published : 19 Apr 2022 02:47 IST

Kangra Fort: ఆ ఎనిమిది బంగారు బావులు ఏమైనట్టు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్‌ దండెత్తాడు. అక్బర్ 52 సార్లు విఫలయత్నం చేశాడు. అతని కుమారుడు జహంగీర్‌ 14 నెలలపాటు యుద్ధం చేసి చివరకు గెలుచుకున్నాడు. అదే కాంగ్‌డా కోట. వేల సంవత్సరాలుగా అంతులేని నిధి నిక్షేపాలను తన గర్భంలో దాచుకున్న ఈ కోటను కొల్లగొట్టడానికి ఎందరో ప్రయత్నించారు. అందినకాడికి దోచుకెళ్లారు. అయినా పూర్తి స్థాయిలో దక్కించుకోలేకపోయారు. 

రహస్యాల కోట.. 

భారతదేశంలో ఏ చారిత్రక కట్టడం తీసుకున్నా దాని వెనుక ఎన్నో వింతలూ, విశేషాలు.. అబ్బురపరిచే పురాణ గాథలు ఉంటాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్‌డా సమీపంలో ఉన్న ఈ కోట అందులో ఒకటి. 465 ఎకరాల విస్తీర్ణంలో, ప్రకృతి సోయగాల నడుమ, 11 ప్రధాన ద్వారాలతో శత్రుదుర్బేధ్యంగా దీనిని నిర్మించారు. భీకర దాడులకు ఎదురొడ్డి, భూకంపాలను సైతం తట్టుకుని నిలిచిన ఈ కోట ఇప్పటికీ ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకొనివుంది. లోపల మొత్తం 21 బావుల నిండా లెక్కలేనంత సంపద ఉండేదని.. కాలక్రమంలో కొందరు వాటిని దోచుకోగా ఇప్పటికీ 8 బంగారు బావులు ఉన్నాయని వేల ఏళ్ల కోట చరిత్ర చెప్తోంది. 

ప్రవేశం నిషిద్దం..

స్థానికంగా కాంగ్‌డా కోటపై ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. కటోచ్‌ రాజ్యానికి చెందిన సుశర్మ చంద్ర 3,500 ఏళ్ల క్రితం ఈ కోటను నిర్మించాడు. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన నిలిచి పోరాడాడు. అనంతరం తన సేనలతో ఈ ప్రాంతానికి వచ్చాడు. శత్రువుల దాడుల నుంచి తన రాజ్యన్ని కాపాడుకునేందుకు హిమాలయాలకు సమీపంలో భారీ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఎవరైనా లోపలికి ప్రవేశించాలని చూస్తే అక్కడున్న ద్వారపాలకులు నిర్ధాక్షిణ్యంగా వారి తల మొండెం వేరు చేసేవారట. అందుకు కారణం కోటలోని అమూల్యమైన సంపదేనని అంతా భావించేవారు.

బంగారు బావుల జాడేది?

కోటలోని ఆలయాలకు నిత్యం విలువైన బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యాలు గుట్టలుగా వచ్చిచేరేవి. అప్పటి పాలకులు  భారీగా బంగారాన్ని దేవతలకు సమర్పించుకునేవారు. కొంత కాలానికి లెక్కించడానికి సాధ్యం కానంత సంపద పోగుపడింది. దీనంతటినీ కోటలో ఉన్న 21 బావుల్లో నిక్షిప్తం చేశారు. మహమ్మద్‌ గజనీ 8 బావులను, బ్రిటీషు వారు 5 బావులను దోచుకొని వెళ్లారు. అలా ఈ బంగారు బావుల సంపద కోసం కాంగ్‌డా కోట ఎన్నో దాడులను తట్టుకుంది. కానీ ఇప్పటికీ ఆ మిగిలిన 8 బంగారు బావుల జాడ రహస్యంగానే మిగిలింది. బావులు ఒక్క చోట కాకుండా కోటలోని వివిధ ప్రాంతాల్లో తవ్వించి అందులో నిధులను నిక్షిప్తం చేశారు. దీంతో మిగిలిన ఎనిమిది బావులు ఎక్కడ అన్నది చిదంబర రహస్యంగా మిగిలిపోయింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని