ఏపీ వాదన నిరాధారం: తెలంగాణ

జల వివాదం నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని కృష్ణా నది యామమాన్య బోర్డు(కేఈఆర్‌ఎంబీ)కి ఏ..పీ

Published : 05 Jul 2021 00:59 IST

హైదరాబాద్‌: జల వివాదం నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఈఆర్‌ఎంబీ)కు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కేఆర్‌ఎంబీ.. శ్రీశైలం ఎడమగట్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

కృష్ణా బోర్డు రాసిన లేఖకు స్పందనగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ బోర్డు ఛైర్మన్‌కు మరో లేఖ రాశారు. శ్రీశైలం జల విద్యుత్‌ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో ప్లానింగ్‌ కమిషన్‌, కృష్ణా మొదటి ట్రైబ్యునల్‌ పూర్తి స్థాయిలో విద్యుత్‌ వినియోగానికి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1991 నుంచి ఏప్రిల్‌, మే నెలలో ఏరోజూ కూడా 834 అడుగులకుపైగా నీటి మట్టం ఉండేలా చూడలేదన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం 854 అడుగుల పైన నీటిమట్టం ఉండాలని కోరుతోందన్నారు. ఏపీ బేసిన్‌ వెలుపలకు కృష్ణా జలాలను తరలించేందుకే ఏపీ ప్రభుత్వం ఈ వాదనను వినిపిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు.ఏపీ రెండేళ్లుగా 170 టీఎంసీలు, 124 టీఎంసీలు బేసిన్‌ వెలుపలకు తరలించిందన్నారు. చెన్నై తాగునీటి కోసం 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పెన్నా సహా ఇతర బేసిన్లలో 360 టీఎంసీల నీరు ఉందన్నారు. తెలంగాణ విద్యుదుత్పత్తితో ఏపీకి నష్టమన్న వాదన నిరాధారమని, 50 శాతం నిష్పత్తితో విద్యుత్‌ పంచాలని విభజన చట్టంలో లేదని స్పష్టం చేశారు. ముందు చేసుకున్న అవగాహన ఆ ఏడాదికే వర్తిస్తుందన్నారు. 2013లో కృష్ణ డెల్టా అవసరాల కోసం 760 అడుగుల వరకు నీరు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. దీనిపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అభిప్రాయానికి రావాలని ఈఎన్‌సీ మురళీధర్‌ కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని