Bapatla: ఓటర్ల జాబితా సవరణలో జోక్యం.. నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. 

Updated : 24 Oct 2023 20:53 IST

పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. మార్టూరు సీఐ టి.ఫిరోజ్‌, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి ఎస్సైలు ఎన్‌సీ ప్రసాద్, కె.కమలాకర్, కె.అనూక్‌ను సస్పెండ్‌ చేస్తూ  బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇది పోలీసు, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికారనేతల ఆదేశాల మేరకు పనిచేసి చివరకు వీరు తమ కొలువులకే ఎసరుతెచ్చుకున్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొన్న మహిళా పోలీసులపై (సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణాధికారులు) వీరు నిబంధనలకు విరుద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన ఫారం-7 దరఖాస్తుల సమాచారాన్ని సేకరించి అధికార పార్టీ నేతలకు చేరవేశారని, వారితో ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఒకటి ఏర్పాటు చేసి తొలగింపు ఓట్లపై మాట్లాడుతున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు చేసింది. సీఈఓ ముఖేష్‌కుమార్‌ మీనా ఈ వ్యవహారంపై బాపట్ల జిల్లా పాలనాధికారిని విచారణకు ఆదేశించారు. బీఎల్‌వోలు పోలీసు అధికారులకు సమాచారం పంపినట్లుగా ధ్రువీకరించుకుని సీఈసీకి నివేదించారు.

అయినా బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుబడుతూ తెదేపాకు చెందిన నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాతే ఎన్నికల సంఘంలో కదలిక వచ్చింది. బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదించాలని ఆదేశించింది. అసలు ఎన్నికల విధుల్లో పోలీసుల జోక్యమే ఒక తప్పిదం కాగా, వారు ఏకంగా బీఎల్‌వోలతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి తొలగింపు ఓటర్ల జాబితాపై వారితో చాటింగ్‌ చేయటం, కాల్స్‌చేసి మాట్లాడటం వంటివి ఆధారాలతో సహా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు, సీఈసీ ఆదేశాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాదికారులు అప్రమత్తమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని