నో ట్రాఫిక్‌ చలాన్స్‌.. ఓన్లీ లాలీపాప్స్‌

సాధారణంగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. వేలకి వేలు జరిమానాలు విధిస్తుంటారు ట్రాఫిక్‌ పోలీసులు. అప్పటికీ వినకపోతే లైసెన్స్‌లు రద్దు చేయడం, కేసులు నమోదు చేయడం చూస్తుంటాం.

Published : 13 Jan 2020 01:15 IST

జమ్మూకశ్మీర్: సాధారణంగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. వేలకి వేలు జరిమానాలు విధిస్తుంటారు ట్రాఫిక్‌ పోలీసులు. అప్పటికీ వినకపోతే లైసెన్స్‌లు రద్దు చేయడం, కేసులు నమోదు చేయడం చూస్తుంటాం. వీటికి పూర్తి భిన్నంగా చలాన్లకు బదులు లాలీపాప్స్‌ ఇవ్వటం ఎప్పుడైనా చూశారా! సరిగ్గా.. జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలోని ఉధంపూర్‌ జిల్లాకి చెందిన రవాణా శాఖ అధికారులు ఇదే పని చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలపై పౌరులకు అవగాహన కల్పించే క్రమంలో నిబంధనలు అతిక్రమించిన వారికి చలాన్లు రాయకుండా లాలీపాప్స్‌ అందజేశారు. 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ సహాయ అధికారిణి రచనా శర్మ మాట్లాడుతూ.. ప్రజలు ద్విచక్రవాహనాలు, కార్లలో ప్రయాణించేటప్పుడు వారి వ్యక్తిగత భద్రత కోసం హెల్మెట్లు, సీటు బెల్టులు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇది వారి బాధ్యతగా గుర్తించాలన్నారు. ‘మామూలుగా రోజాపూలు, చాక్లెట్లు పంచితే.. ప్రజలు చాలా తేలిగ్గా తీసుకుంటారు. అలా కాకుండా లాలీపాప్స్‌ ఇస్తే కొంత బాధ్యతగా భావిస్తారు. కానీ వారు సానుకూలంగా తీసుకొని ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తారని నేను నమ్ముతున్నాను’ అని ఆమె చెప్పారు.

నిబంధనలు అతిక్రమించిన వారికి లాలీపాప్స్‌ ఇవ్వటమేగాక వారి చేతిలో ‘ట్రాఫిక్‌ రూల్స్‌ని ఉల్లంఘించాను’ అని, ఎవరైతే రూల్స్‌ పాటిస్తున్నారో వారికి ‘ట్రాఫిక్‌ రూల్స్‌ని అనుసరిస్తున్నాను’అనే ప్లకార్డ్‌లు వారి చేతిలో పెడుతున్నారు. ఇలా చేస్తూ మీడియా ముందు ఫొటోలు తీస్తుండటం వల్ల వాహనదారుల్లో కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నామని రవాణా అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని