‘మేం బాగున్నాం.. పుకార్లు నమ్మొద్దు’

చైనాలో కరోనా వైరస్‌ ప్రబలుతోన్న నేపథ్యంలో అక్కడున్న తెలుగువారి ఆరోగ్య పరిస్థితులపై పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడున్న తెలుగువారిని సొంత రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు...

Published : 31 Jan 2020 01:35 IST

వుహాన్‌లో ఉన్న తెలుగు ఇంజినీర్ల సెల్ఫీ వీడియో

హైదరాబాద్‌: చైనాలో కరోనా వైరస్‌ ప్రబలుతోన్న నేపథ్యంలో అక్కడున్న తెలుగువారి ఆరోగ్య పరిస్థితులపై పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడున్న తెలుగువారిని సొంత రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగరీత్యా చైనాలోని వుహాన్‌లో పనిచేస్తున్న తెలుగు ఇంజినీర్లు వారి ఆరోగ్య పరిస్థితులపై ఒక సెల్ఫీ వీడియో తీసి పంపించారు.

‘మమ్మల్ని ఎవరూ బంధించలేదు. ఇక్కడ అందరం క్షేమంగా ఉన్నాం. సమయానికి ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. మాకు రోజూ వైద్య పరీక్షలు చేస్తున్నారు. మేం పనిచేస్తున్న కంపెనీ మమ్మల్ని బాగా చూసుకుంటోంది. మా విషయంలో ఎలాంటి పుకార్లు నమ్మొద్దు. బీజింగ్‌లోని భారత ఎంబసీతో మాట్లాడాం. త్వరలోనే భారత్‌కు తిరిగి వచ్చేస్తాం’ అని వారు పంపించిన వీడియోలో తెలుగు ఇంజినీర్లు పేర్కొన్నారు.

అన్ని వసతులు కల్పిస్తున్నాం: టీసీఎల్‌

చైనాలో ఉన్న టీసీఎల్‌ కంపెనీకి చెందిన ఇంజినీర్ల ఆరోగ్య పరిస్థితులపై ఆ సంస్థ స్పందించింది. ‘చైనాలోని షెంజన్‌ నగరంలో శిక్షణలో ఉన్న 16 మంది ఉద్యోగులు ఇప్పటికే హాంకాంగ్ చేరుకున్నారు. వీరు కాకుండా మరో 58 మంది వుహాన్‌లో ఉన్నారు. అక్కడ వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నాం. హౌస్ అరెస్ట్ చేశారని వస్తున్న వార్తలు అవాస్తవం. వుహాన్ నగరంలో రాకపోకలకు నిషేధం ఉంది. ప్రస్తుతం అక్కడ బయటకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. భారత ఎంబసీతో సంస్థ సంప్రదింపులు జరుపుతోంది. మూడు రోజుల్లో సానుకూల సంకేతాలు వస్తాయని ఆశిస్తున్నాం. వారికి రోజూ ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం. ప్రతి ఒక్కరి పరిస్థితి నిలకడగా ఉంది’ అని టీసీఎల్‌ సంస్థ ప్రతినిధి రఘు తెలిపారు.

ఇవీ చదవండి..
రక్షించండి... వుహాన్‌లో భారతీయ విద్యార్థులు

భారత్‌లో తొలి ‘కరోనా’కేసు నమోదు

అవనిగడ్డలో కరోనా వైరస్‌ కలకలం

గాంధీ ఆస్పత్రిలోనే ‘కరోనా’ పరీక్షలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని