ఓటరు గుర్తింపు కార్డులో శునకం ఫొటో

ఓటరు గుర్తింపు కార్డులో ఒకరి ఫొటోకు బదులు వేరొకరి ఫొటో రావడం చూశాం. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటమూ చూశాం. తాజాగా కుక్క ఫొటోతో ఉన్న ఓటరు...

Published : 05 Mar 2020 21:51 IST

కోల్‌కతా: ఓటరు గుర్తింపు కార్డులో ఒకరి ఫొటోకు బదులు వేరొకరి ఫొటో రావడం చూశాం. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటమూ చూశాం. తాజాగా కుక్క ఫొటోతో ఉన్న ఓటరు గుర్తింపును అధికారులు జారీ చేశారు. పశ్చిమబెంగాల్‌లో ఈ విచిత్రం చోటు చేసుకుంది. ముషీరాబాద్‌లోని రామ్‌నగర్‌ గ్రామవాసి అయిన సునీల్‌కుమార్‌ కొంతకాలం క్రితం కొత్త ఓటరు గర్తింపు కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల సూచన మేరకు ఓటరు గుర్తింపు తీసుకునేందుకు దులాల్‌ స్ర్మితీ పాఠశాలకు వెళ్లాడు. అక్కడ ఉన్న అధికారి గుర్తింపు కార్డుపై సంతకం చేసి మరీ సునీల్‌కు గుర్తింపు కార్డు అందజేశారు.

తీరా కార్డుపై ఉన్న ఫొటోను చూసి సునీల్‌ కంగుతిన్నాడు. కార్డులో తన ఫొటోకు బదులు దర్జాగా పడుకొని ఉన్న ఓ శునకం చిత్రం కనిపించింది. వెంటనే అధికారులను సంప్రదించాడు. గుర్తింపు కార్డుపై తన ఫొటోకు బదులు కుక్క ఫొటో రావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ఫొటో సిబ్బంది పొరపాటు వల్ల వచ్చిందని, కార్డుపై ఉన్న ఫొటోను మార్చుకోవడానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే సునీల్‌కు కొత్త గుర్తింపు కార్డును అందజేస్తామని చెప్పారు. అయితే, ఇలాంటి సంఘటన మళ్లీ ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని హెచ్చరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని