రంగ రంగా..పర్యాటకంగా మారేది ఎప్పుడింకా!

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అతిపెద్ద వైష్ణవ దేవాలయమది. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమది. శిల్పాకళా సంపద, తంజావూరు చిత్రపటాలతో

Published : 19 Mar 2020 06:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అతిపెద్ద వైష్ణవ దేవాలయమది. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమది. శిల్పాకళా సంపద, తంజావూరు చిత్రపటాలతో అలరారుతు జిల్లాకే తలమానికంగా నిలిచింది ఈ ఆలయం. పర్యాటక కేంద్రంగా మార్చాలని ఏళ్లుగా డిమాండ్లు కొనసాగుతున్నా.. పట్టించుకునే నాథుడు లేక నిరాదరణకు గురవుతోంది ఈ  రంగనాయక క్షేత్రం. ఉత్సవాలు వేడుకల వేళ కనీస వసతులు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీరంగ రంగా...అంటు నిట్టూర్చుతున్నారు. తీరునా ఈ తిప్పలు అంటూ స్వామి వద్ద తమ గోసను చెప్పుకుంటున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా (ప్రస్తుత వనపర్తి జిల్లా)లోని ఆ ఆలయమే శ్రీరంగనాయకస్వామి దేవాలయం. తమిళనాడులోని శ్రీరంగాన్ని దక్షిణ శ్రీరంగంగా పిలిస్తే ఈ ఆలయాన్ని ఉత్తర శ్రీరంగంగా పిలుస్తున్నారు. స్వయంభువుగా ఇక్కడ వెలసిన శ్రీరంగనాయక స్వామి, శేష శయనుడుగా, శ్రీదేవి, భూదేవి సమేతంగా  భక్తులకు దర్శనమిస్తున్నాడు. అరవైఏడు అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం, శిల్పకళా సంపద చూపరులను కట్టిపడేస్తాయి. ఇక్కడి మ్యూజియంలో ఉన్న తంజావూరు చిత్రపటాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. రామాయణ, మహాభారత ఘట్టాలు, దేవతామూర్తులు ఆకట్టుకుంటాయి. చుట్టూ జలాశయం, పచ్చని పంట పొలాల మధ్య ఈ ఆలయం అందాలు పర్యాటకుల మనసును మైమరిపిస్తాయి. ఏటా ఫాల్గుణ శుద్ధ సప్తమి నుంచి ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పుబ్బ నక్షత్రం రోజున జరిగే రథోత్సవానికి వేలసంఖ్యలో భక్తులు తరలివస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడని ఈ స్వామివారు ప్రఖ్యాతిగాంచారు. ఇక్కడ వివిధ సినిమాలు, ధారావాహికల చిత్రీకరణలు కూడా జరుగుతుంటాయి.  

ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా ఆదరణ కరవైంది. ఇక్కడి జలాశయంలో బోటింగ్‌ ఏర్పాటు చేయటానికి మంచి అవకాశం ఉంది. ఉద్యానవనాలు అభివృద్ధి చేయటానికి సరిపడా వనరులున్నాయి. అయితే అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నాలుగైదు ఏళ్ల క్రితం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయలతో ఇక్కడ వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. ఉత్సవాల సమయంలో అధిక సంఖ్యలో వచ్చే భక్తులు మంచినీరు, రోడ్డు, శౌచాలయాలు తదితర వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస వసతులు కల్పించటం లేదని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రంగనాయకుని క్షేత్రాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.

 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని