కరోనా కట్టడికి భారత్‌కు చైనా అభయం!

ప్రపంచ మానవాళి మనుగడకే ముప్పుగా మారుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భారతదేశానికి సహాయం చేస్తామని చైనా తెలిపింది. కొవిడ్‌-19 అంతం కోసం ప్రయత్నిస్తున్న యూరేసియా, దక్షిణాసియా దేశాలకు సహకరిస్తామని వెల్లడించింది. చైనా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా దేశాల వైద్య,...

Updated : 29 Feb 2024 13:11 IST

యూరేసియా, దక్షిణాసియా దేశాలకు సాయం చేస్తామన్న బీజింగ్‌

దిల్లీ: ప్రపంచ మానవాళి మనుగడకే ముప్పుగా మారుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భారతదేశానికి సహాయం చేస్తామని చైనా తెలిపింది. కొవిడ్‌-19 అంతం కోసం ప్రయత్నిస్తున్న యూరేసియా, దక్షిణాసియా దేశాలకు సహకరిస్తామని వెల్లడించింది. చైనా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా దేశాల వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మందికి కొవిడ్‌-19 సోకింది. పదివేలకు పైగా మరణించారు. ఇటలీలో ఏకంగా మరణ మృదంగమే మోగుతోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం చిగురుటాకుల వణుకుతోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్‌లోనూ మరణాల సంఖ్య వందల నుంచి వేలల్లోకి చేరాయి. ఫ్రాన్స్‌ వంటి దేశాలు నగరాలను దిగ్బంధం చేస్తున్నాయి. మన దేశంలోనూ ఆదివారం ప్రజలు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

భారత్‌ కొవిడ్‌-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు తన సామర్థ్యం మేరకు చైనా సాయం చేస్తుందని భారత్‌కు చైనా రాయబారి సన్‌ వీడంగ్‌ ట్విటర్లో తెలిపారు. కరోనా వైరస్‌ను ఎలా అడ్డుకోవాలో, నియంత్రించాలో యూరేసియా, దక్షిణాసియా ప్రాంతాల ప్రతినిధులతో చైనా ఒక వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిందని ఆయన వెల్లడించారు. ‘భారత వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, విదేశాంగ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు కొవిడ్‌ మహమ్మారితో పోరాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చైనా ప్రతినిధులతో చర్చించారు’ అని సన్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని