హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్‌ 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేయడంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌...

Updated : 28 May 2020 12:48 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేయడంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో ఉన్నందున విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. 

పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం రంగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైకాపా జెండాను పోలిన రంగులతో పాటు కొత్తగా మట్టి రంగును వేయాలని 623 జీవోను జారీ చేసింది. దీంతో పంచాయతీ కార్యాలయాలకు అప్పటికే వేసిన రంగులతో పాటు అదనంగా మట్టి రంగు వేశారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ధిక్కరించి వైకాపా రంగులతో పాటు మట్టి రంగును జత చేసిందని సోమయాజులు అనే న్యాయవాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ..కోర్టు ధిక్కరణ కింద ఎదుకు పరిగణించకూడదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎస్‌తో, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు నేడు కోర్టుకు హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని