Updated : 29 May 2020 13:49 IST

రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించండి: హైకోర్టు

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం  కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం... రమేశ్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించిన సెక్షన్‌ 200ని పూర్తిగా మార్చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 

హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా కొనసాగుతారని తెలిపారు. ఎన్నికల కమిషనర్‌గా కనగరాజు కొనసాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఆర్డినెన్స్‌ రద్దు కావడంతో నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఎస్‌ఈసీగా ఉన్నట్టేనని వివరించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని పిటిషనర్‌, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. హైకోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డను తప్పించిన తీరు, కనగరాజును నియమించిన వ్యవహారం దోషపూరితంగా ఉందన్నారు. కోర్టు ఆదేశాలను సానుకూలంగా తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టమన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితోనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్టు చెప్పారు. ‘‘ కరోనా విషయంలో ప్రభుత్వం మొదట్లో తీసిపారేసింది. ఎల్జీ పాలిమర్స్‌ విషయంలో కూడా ప్రభుత్వ వైఖరి సరిగా లేదు. రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం తప్పులు చేస్తోంది. ప్రభుత్వం తన వద్ద తప్పులు పెట్టుకుని వ్యవస్థను నిందించడం తగదు. కేంద్రానికి మనతో పని ఉంటుందని జగన్‌ అనడం దేనికి నిదర్శనం?. కేంద్రం అస్థిరం చెందాలని సీఎం చూస్తున్నారా? ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు పాజిటివ్‌గా తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కామినేని అన్నారు.

ఏం జరిగిందంటే?
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 7న షెడ్యూల్‌ ప్రకటించింది. ఒకపక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌ నిర్వహిస్తే కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని, అందుకే ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తున్నామని మార్చి 15న రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. ఆయన ప్రతిపక్షనేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారని, ఆ పార్టీకి మేలు చేసేందుకే ఎన్నికలు వాయిదా వేశారని ముఖ్యమంత్రి జగన్‌తోపాటు మంత్రులు, వైకాపా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు రాష్ట్రంలో భద్రత లేదని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని మార్చి 18న ఎన్నికల కమిషనర్‌ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. అప్పటి నుంచి ఆయన  కొంతకాలం హైదరాబాద్‌ నుంచే విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ రమేశ్‌ కుమార్‌కు చెక్‌ పెట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారంపై శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని