ఏడాదవుతున్నా తడబాటే

జిల్లాల ఏర్పాటులో చూపినంత చొరవ కార్యాలయాల ఏర్పాటులో ప్రభుత్వం తీసుకోకపోవడంతో చాలా శాఖలు పరాయి పంచన ఇరుకుగదుల్లో కాలక్షేపం చేయాల్సి వస్తోంది.

Updated : 29 Jan 2023 06:29 IST

ఇరుకు గదుల్లో జిల్లా కార్యాలయాలు

జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగ కార్యాలయంలో నడుస్తున్న సమాచార శాఖ కార్యాలయం

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాల ఏర్పాటులో చూపినంత చొరవ కార్యాలయాల ఏర్పాటులో ప్రభుత్వం తీసుకోకపోవడంతో చాలా శాఖలు పరాయి పంచన ఇరుకుగదుల్లో కాలక్షేపం చేయాల్సి వస్తోంది. విభజన పూర్తై దాదాపు ఏడాది సమీపిస్తున్నా సౌకర్యవంతమైన కార్యాలయాలు సమకూరే పరిస్థితి కానరాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితుల్లో విధులు ఎలా నిర్వహించాలన్న ఆవేదన అధికారులు, ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. 

స్వాతంత్య్రానికి పూర్వం నుంచి జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నంలో కొన్ని ప్రధానమైన విభాగాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు జిల్లా ఉన్నతాధికారులందరూ విజయవాడకే పరిమితం అయ్యే పరిస్థితుల్లో నగరం పేరుకు మాత్రమే జిల్లా కేంద్రంగా ఉండేది. గతంలోనే పరిపాలనా సౌలభ్యం పేరిట మచిలీపట్నంలోనే ఉండాల్సిన కొన్ని జిల్లా స్థాయి కార్యాలయాలను విజయవాడకు తరలించేశారు. ఈ నేపథ్యంలో జిల్లాల విభజన చేయడం నూతనంగా ఏర్పాటైన కృష్ణాకు మచిలీపట్నంనే జిల్లా కేంద్రంగా కొనసాగించడంతో ప్రజల్లోనూ హర్షం వ్యక్తమయ్యింది. నూతన జిల్లాల్లో అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సౌకర్యాలతో పనిలేదన్నట్టు అధికారులు హడావుడిగా కార్యాలయాల ఏర్పాటుకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా శాఖల వారీ మొత్తం 65 వరకూ జిల్లా స్థాయి కార్యాలయాలు ఉండాల్సి ఉండగా అందులో దాదాపు 40 వరకూ సొంత కార్యాలయాలు ఉన్నాయి. విభజనకు పూర్వం మచిలీపట్నంలో లేని విభాగాలు, గతంలో మచిలీపట్నం నుంచి విజయవాడకు తరలిపోయిన వాటికి మాత్రం నూతన భవనాలు అవసరమయ్యాయి.

నిరుపయోగమైన రూ.లక్షల వ్యయం

ముందుచూపు లేకుండా దాదాపు 16 ప్రభుత్వ విభాగాల ఏర్పాటు కోసం హడావుడిగా నగరంలోని ఓ శిథిలస్థితిలో ఉన్న భవనం ఆధునికీకరణ కోసం రూ.లక్షల్లో ఖర్చు చేశారు. పెద్దమొత్తంలో ఖర్చు చేసినా ఒక్క కార్యాలయమూ అందులో ఏర్పాటు కాలేదు. సమాచారశాఖ కార్యాలయానికి జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగంలోని  గదులు కేటాయించగా అవి సరిపోకపోవడంతో ఇప్పటి వరకూ ఉన్న అద్దె భవనాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా ఖజానా విభాగం పక్కనే నిరుపయోగంగా ఉన్న భవనం సమాచారశాఖకు కేటాయించి కొంత మేర మరమ్మతులు చేయించినా విద్యుత్తు బకాయిల వంటి కారణాలతో నెలల తరబడి ఎటువంటి కదలికలేకుండా పోయింది. ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన, జిల్లా గ్రామీణనీటి సరఫరా విభాగ కార్యాలయాలు సంబంధిత విభాగాలకు చెందిన భవనాల్లోనే ఇబ్బందుల నడుమ నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి అన్ని విభాగాలకు ప్రయోజనకరంగా ఉండేలా సొంత భవనాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా ప్రభుత్వ విభాగాలు ఎక్కడ ఉన్నాయనే సూచికను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

మౌలిక వసతులూ లేవు

జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వసతులు కల్పించాల్సి ఉంది. రవాణా, ఉద్యాన, ఆత్మ, సమాచార, భూగర్భ జలవనరులు, మైనింగ్‌, అటవీ, పరిశ్రమలు తదితర శాఖలకు సొంత కార్యాలయాలు లేవు. కలెక్టరేట్‌ ప్రాంగణంతో పాటు నగరంలో నూతన కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యత దృష్ట్యా వీటిల్లో భవన నిర్మాణాల నిమిత్తం నిధుల మంజూరు పెద్ద సమస్య కాదు. కొన్ని ప్రభుత్వ భవనాలు శిథిలస్థితికి చేరాయి. కొన్ని సంవత్సరాలుగా నూతన భవన నిర్మాణాల కోసం రూపొందించిన అంచనాలు కాగితాలకే పరిమితమయ్యాయి.  రవాణా శాఖ వంటి కార్యాలయానికి నూతన భవన నిర్మాణం సంవత్సరాల తరబడి పునాదుల దశలోనే ఉంది.  బీసీ సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోజన సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్‌ తదితర విభాగాలున్న భవనం పూర్తిగా పాడైపోవడంతో పునఃనిర్మాణానికి ఏనాడో ప్రతిపాదనలు పంపారు. నేటి వరకూ అతీగతీ లేదు. శ్లాబు పెచ్చులూడిన పడుతున్న కారణంగా బీసీ సంక్షేమశాఖను కొన్ని నెలల క్రితం అద్దె భవనంలోకి తరలించారు. రవాణా, సమాచార, పౌరసరఫరాలు, అటవీ, భూగర్భజలవనరులు తదితర కార్యాలయాలూ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. సొంత భవనాలు అవసరమే అయినా ఆదిశగా దృష్టి సారించకుండా అద్దెలు చెల్లిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు