జగనన్న కాలనీల జగడం

అనకాపల్లి జిల్లా గృహనిర్మాణ సంస్థలో అధికారుల పనితీరు బాగోలేదు.. మునగపాక మండలంలో జగనన్న కాలనీల కోసం తెచ్చిన సిమెంట్‌, ఇనుము అక్కడి వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ అమ్మేసుకున్నారు.

Updated : 24 May 2023 06:24 IST

సిమెంట్‌, ఇనుము, అమ్మేసుకున్నారు!
జడ్పీ సర్వసభ్య సమావేశంలో భగ్గుమన్న సభ్యులు
అల్లూరి జిల్లాలో విద్యాప్రమాణాలు పడిపోవడంపై నిలదీత
ఉపాధిహామీ పథకంలో గ్రావెల్‌ రోడ్ల మంజూరుకు వినతి
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

సమావేశానికి హాజరైన సభ్యులు

అనకాపల్లి జిల్లా గృహనిర్మాణ సంస్థలో అధికారుల పనితీరు బాగోలేదు.. మునగపాక మండలంలో జగనన్న కాలనీల కోసం తెచ్చిన సిమెంట్‌, ఇనుము అక్కడి వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ అమ్మేసుకున్నారు.. ఆయన అక్రమాలు తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.. అనకాపల్లి మండలంలో ఒక సహాయక ఇంజినీరు రూ.10 వేలు తీసుకుని ఇళ్లు మంజూరు చేశారు.. ఆ శాఖలో దిగువస్థాయి నుంచి జిల్లా అధికారి వరకు అవినీతికి పాల్పడుతున్నారు’ అని మునగపాక జడ్పీటీసీ సభ్యుడు, అనకాపల్లి ఎంపీపీ ఆరోపించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలుశాఖల పనితీరుపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గృహనిర్మాణ సంస్థ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ధ్వజమెత్తారు. వివిధ సమస్యలపై సభ్యులడిగిన ప్రశ్నలకు విశాఖ, అనకాపల్లి జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు విశ్వనాథన్‌, జాహ్నవి సమాధానమిస్తూ పరిష్కారానికి హామీ ఇచ్చారు.

స్వామి సత్యనారాయణ,                     దొండా రాంబాబు

రూ.40 లక్షల సిమెంట్‌, ఇనుము మాయం..

‘మునగపాక మండలంలో గృహనిర్మాణ సంస్థ ఉద్యోగి ఒకరు రూ.40 లక్షల విలువైన సిమెంట్‌, ఇనుము దారి మళ్లించి జేబులు నింపుకొన్నారు.. ఆపై లబ్ధిదారులకు ఇచ్చే మెటీరియల్‌లో కోతలు పెట్టి బొక్కేసిన సొమ్ముకు లెక్క సరిచేయాలనుకున్నారు. ఈ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఈ వరకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా రికవరీ చేశారు.  ఈ విషయాన్ని జడ్పీ సమావేశంలో ప్రస్తావించొద్దని ఓ అధికారి నాకు కాల్‌ చేసి అడగడంలో ఆంతర్యం ఏమిటి?’ అని మునగపాక జడ్పీటీసీ సభ్యుడు జిల్లా హౌసింగ్‌ హెడ్‌ కూర్మినాయుడిని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రాథమిక విచారణ జరిపించామని రూ.35 లక్షల వరకు దారిమళ్లినట్లు గుర్తించామని.. కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లగా సమగ్ర విచారణ జరిపించమన్నారని చెప్పారు. ఆ తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు. అసలు ఇంత మొత్తంలో మెటీరియల్‌ పక్కదారి పడుతుంటే మీ పర్యవేక్షణ ఏమైందంటూ సభ్యుడు నిలదీశారు. 

సమావేశంలో వేదికపై ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు,
ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, జేసీలు విశ్వనాథన్‌, జాహ్నవి

పాత రేట్లతో పనులంటే ఎట్లా..

‘గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు మూడేళ్ల క్రితమే మంజూరు చేశారు. బిల్లులు చెల్లింపుల్లో జాప్యం వల్ల ఆ నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. 2020 నాటి ఎస్‌ఆర్‌ రేట్లతో ఇప్పుడు పనులు చేయాలంటే నష్టాలొస్తున్నాయని ముందుకు రావడం లేదు’ అని పలువురు జడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించారు. ఇసుక సమస్య గురించి ప్రస్తావించగా స్పందించిన మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రభుత్వ పనులకు ఉపయోగించే ఇసుక విషయంలో స్థానిక అధికారులు అడ్డుకోకుండా కలెక్టర్‌ చూడాలన్నారు. వారు సూచించిన ప్రదేశానికి కాకుండా వేరే అవసరాలకు తరలిస్తే వాహనాలను సీజ్‌ చేయాలన్నారు. ఉపాధిహామీలో చెరువులు బాగుచేస్తున్నారు.. కాలువలు, మదుమలు, చప్టాలు వదిలేస్తున్నారు. దీనివల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ్యులు ప్రశ్నించారు. ఉపాధి నిధులతో గ్రావెల్‌ రోడ్లు మంజూరు చేయాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర సూచించగా ప్రాధాన్య పనులు చేసి తర్వాత ఈ రోడ్లపై దృష్టిసారిస్తామని డ్వామా పీడీ సందీప్‌ చెప్పారు.

మాట్లాడుతున్న గిరిబాబు,              నూకరాజు


అల్లూరిలో ఫలితాలు అంత ఘోరమా..



దీసరి గంగరాజు

‘విశాఖ, అనకాపల్లిలో పదోతరగతి ఫలితాలు బాగా వచ్చాయి. అల్లూరి జిల్లాలో ఎందుకు తగ్గిపోయాయి. కొన్ని పాఠశాలల్లో ఒక్కరు కూడా పాసవ్వలేదు.. అక్కడా ప్రభుత్వ ఉపాధ్యాయులే కదా బోధిస్తున్నారు. ఎందుకింత తేడా వస్తోంద’ని కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు ప్రశ్నించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌, మరికొందరు సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు-నేడు పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని డిమాండ్‌ చేశారు.

* బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు డిమాండ్‌ చేశారు. * అల్లూరి జిల్లా నుంచి కల్టెకర్‌, జేసీ, ఉన్నతాధికారుల్లో కొందరు హాజరుకాకపోవడంపై ఏజెన్సీ జడ్పీటీసీ సభ్యులు ప్రశ్నించారు. అరకు జడ్పీటీసీ సభ్యురాలు రోహిణి మాట్లాడుతూ వచ్చే సమావేశంలో కలెక్టర్‌ గానీ, జేసీ గానీ కనిపించకపోతే అల్లూరి జిల్లా సభ్యులంతా సమావేశాన్ని బహిష్కరిస్తామన్నారు. * ఈ సమావేశానికి అరకు, అనకాపల్లి, విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాలేదు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాత్రమే వచ్చారు. * రోలుగుంట జడ్పీటీసీ సభ్యురాలు పోతల రమణమ్మకు బదులు ఆమె భర్త శ్రీనివాసరావు దర్జాగా జడ్పీ సమావేశంలో కూర్చొని అధికారులపై ప్రశ్నలు సంధించడం విశేషం. * అనకాపల్లి ఆసుపత్రిలో ప్రసవాలకు రక్తదాతలు లేకపోతే కేజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నారని బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యుడు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కేజీహెచ్‌లో ఎస్టీ సెల్‌ను పటిష్ఠం చేయాలని సభ్యులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని