జోరుగా పైరవీలు!

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించిన సహాయ ఆచార్యుల్లో కొంతమంది ఇక్కడ పనిచేయడానికి అంతగా సుముఖత చూపటం లేదు.

Updated : 02 Jun 2023 05:45 IST

వైద్య కళాశాలల్లో చేరేందుకు సహాయాచార్యుల నిరాసక్తత

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

న్యూస్‌టుడే, పాలమూరు ; ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించిన సహాయ ఆచార్యుల్లో కొంతమంది ఇక్కడ పనిచేయడానికి అంతగా సుముఖత చూపటం లేదు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల 22న 147 మంది సహాయ ఆచార్యులను కేటాయించింది. అందులో ఇప్పటివరకు 75 మందే విధుల్లో చేరారు. ఇంకా 72 మంది చేరలేదు. ఈ నెల 21 వరకు గడువు ఉండటంతో వారంతా అప్పటివరకు చూద్దాములే అన్నట్లు యోచిస్తున్నారు. పలువురు ఇతర ఆసుపత్రుల్లో పని చేస్తున్నారు. ఇప్పటికే కొద్దిమంది విధుల్లో చేరినవారు, చేరకుండా ఉన్నవారిలో కొందరు వేరే ప్రాంతాలకు వెళ్లడానికి రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడి(డీఎంఈ) కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అక్కడ పైరవీలు చేసుకుంటూ తమకు అనుకూలమైన ప్రాంతాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. క్లీనికల్‌ విభాగంలో ఉమ్మడి జిల్లాకు వచ్చిన వారిలో కొందరికి ప్రస్తుతమున్న ప్రాంతాల్లో సొంత క్లీనిక్‌లు ఉన్నాయి. అవి బాగా నడుస్తుండటంతో విధుల్లో చేరడానికి కొందరు ఆసక్తి చూపడం లేదని తెలిసింది.  

వినతుల బదిలీలతో ముగ్గురు అసోసియేట్లు.. : మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ముగ్గురు అసోసియేట్‌ ఆచార్యులు కూడా రిక్వెస్ట్‌ బదిలీల్లో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. జనరల్‌ మెడిసిన్‌ అసోసియేట్‌ ఆచార్యులు డా.కేశవనాథ్‌గౌడ్‌ జనగామా జిల్లాకు, పాథాలాజీ అసోసియేట్‌ ఆచార్యులు డా.శ్రీలక్ష్మి వికారాబాద్‌ జిల్లాకు, అనస్థీషియా అసోసియేట్‌ ఆచార్యులు డా.సునీత వనపర్తి జిల్లాకు బదిలీ అయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి అసోసియేట్‌ ఆచార్యులు వెళ్తే వారి స్థానాల్లో ఎవరూ కొత్తవారు రాలేదు. ఇప్పటికే తక్కువ మంది ఆచార్యులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు ముగ్గురు వెళ్లిపోవటం సమస్యగా మారింది. కొత్తగా సహాయ ఆచార్యులు వచ్చినా.. అసోసియేట్‌ ఆచార్యులపై పని భారం అధికంగా పడనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల వైద్య కళాశాలలకు కేటాయించిన సహాయ ఆచార్యులంతా వచ్చి విధుల్లో చేరితేనే సమస్య తీరుతుంది. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేటాయించిన 32 సహాయ ఆచార్యుల్లో 24 మంది, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు కేటాయించిన 59 మందిలో 29, వనపర్తి జిల్లాకు కేటాయించిన 56 మందిలో 22 మంది విధుల్లో చేరారు. ఈ నెల 22వ తేదీ తర్వాత గానీ ఎంత మంది జిల్లాలకు వస్తారు, ఎంత మంది వెళతారో స్పష్టత వచ్చే అవకాశం లేదు.

చివరివరకు చూస్తాం.. : సాధ్యమైనంత వరకు ఉద్యోగులు తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. మహబూబ్‌నగర్‌కు కేటాయించిన వారిలో ఎక్కువ మంది ఇక్కడే ఉంటారని అనుకుంటున్నా. రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల వద్ద పైరవీలకు తావుండదు. తప్పనిసరిగా వారంతా కేటాయించిన జిల్లాల్లోని కళాశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. సకాలంలో రాకపోతే ప్రభుత్వానికి తెలియచేస్తాం. ఇంకా 20 రోజుల గడువు ఉంది. చివరివరకు చూస్తాం.

డా.రమేశ్‌, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని