పుట్టుకొస్తున్న నకిలీ విత్తనం..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాలు పుట్టుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతానికి చెందిన కొంత మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి కర్ణాటక రాష్ట్రం నుంచి విడిగా విత్తనాలను తెస్తున్నారు.
ఈనాడు, మహబూబాబాద్, న్యూస్‌టుడే, నర్సంపేట
వరంగల్ కమిషనరేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, నకిలీ విత్తనాల సంచులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాలు పుట్టుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతానికి చెందిన కొంత మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి కర్ణాటక రాష్ట్రం నుంచి విడిగా విత్తనాలను తెస్తున్నారు. వాటిని ఈ ప్రాంతంలోని అన్నదాతలు ఆకర్షించేలా విపణిలో పేరున్న కంపెనీల ప్యాకెట్లలో నింపి అమ్మకాలు చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచే నకిలీల బెడద నుంచి రైతులను కాపాడేందుకు వరంగల్ కమిషనరేట్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ పోలీసు టాస్క్‌ఫోర్స్ బృందం ప్రత్యేక నిఘా పెట్టింది. ఇందులో భాగంగా గురువారం వరంగల్ టాస్క్‌ఫోర్స్ బృందం 15 మంది సభ్యులతో కూడిన ముఠా సభ్యులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.2.11 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుంది. ఫలితంగా వందల ఎకరాల్లో సాగు కావాల్సిన నకిలీ విత్తు మొదట్లోనే దొరికింది. ఈ ముఠా పట్టుబడక ముందు ఎన్ని వందల ప్యాకెట్లు విక్రయించారో తెలియదు. వాటిని కొనుగోలు చేసిన అమాయక రైతులు నష్టపోవాల్సిందే.
నకిలీ విత్తనాలు తయారు చేసే యంత్రాన్ని పరిశీలిస్తున్న సీపీ రంగనాథ్
5.50 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
ఉమ్మడి జిల్లాలో ఈసారి 5.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. ఒక్కో విత్తన సంచి 450 గ్రాములు ఉంటుంది. ఎకరానికి రెండు సంచులు అవసరం. ఈ లెక్కన 5.50 లక్షల ఎకరాలకు 10 లక్షల నుంచి 11 లక్షల విత్తన సంచులు కావాలి. దీనిని దృష్టిలో పెట్టుకున్న అక్రమ వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 పేరిట నకిలీ విత్తనాలను తయారు చేశారు. చేనులో గడ్డి మందును పిచికారి చేసినా ఈ మొక్కలు తట్టుకుంటాయని.. ఇవి అధీకృత డీలర్ల వద్ద లభించవని మాయమాటలు చెప్పి రైతులకు విక్రయిస్తున్నారు. అలాంటి వారి నుంచి పోలీసులు 9786 ప్యాకెట్లతో పాటు 70 క్వింటాళ్ల విడి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే 70 క్వింటాళ్లకు 450 గ్రాముల చొప్పున ఉండే ఒక్కో ప్యాకెట్ లెక్కన 15,555 ప్యాకెట్ల విత్తనాలు. మొత్తంగా వారు పట్టుకున్నవి 25,320 ప్యాకెట్లు ఇవి 12,660 ఎకరాలకు అవసరమయ్యేవి. పోలీసులు వాటిని పట్టుకోవడం వల్ల అన్ని ఎకరాల్లో నకిలీ విత్తనం పాగా వేయకుండా అడ్డుకట్ట వేసి పత్తి రైతులకు భరోసాగా నిలిచారు.
సమావేశంలో నకిలీ విత్తనాలు విక్రయించిన నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీపీ రంగనాథ్, మామునూర్ ఏసీపీ టి. కృపాకర్, ఈస్ట్‌జోన్ జోన్ డీసీపీ పుల్లా కరుణాకర్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, వరంగల్ వ్యవసాయశాఖ అధికారి ఉషా, ఎస్‌బీ ఏసీపీ తిరుమల్ తదితరులు
ఈ జాగ్రత్తలు పాటించండి
* వ్యవసాయాధికారులు ధ్రువీకరించిన అధీకృత దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలి
* విత్తన సంచులపై లాట్ నెంబరు, డేట్ ఆఫ్ ప్యాకింగ్, లేబుల్, విత్తన మొలక శాతం సరిగా ఉందో..?లేదో..? చూసుకోవాలి
* సంచులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానిని మొబైల్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.
* బిల్లుపై రాసిన లాట్ నెంబరు, విత్తనాల పేరును.. ఇచ్చిన విత్తనాల ప్యాకెట్‌ను సరిచూసుకోవాలి
* బీటీ-1, బీటీ-2 విత్తనాలకే అనుమతి ఉంది. బీటీ-3 పేరిట విత్తనాలు ఇస్తే తీసుకోవద్దు
* గ్రామాల్లోకి వచ్చి విక్రయించే వారి వద్ద ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయొద్దు..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.