ఈ వకీల్‌సాబ్.. సంస్కృతంలోనే వాదిస్తారు!
మన దేశంలో అతి ప్రాచీనమైన, ప్రాముఖ్యత గల గొప్ప భాష సంస్కృతం. కానీ, ఆ భాషను వేదాలు చదివే పండితులు తప్ప ఎవరూ నేర్చుకోవట్లేదు. ఇంటర్, డిగ్రీల్లో ద్వితీయ భాషగా సంస్కృతం నేర్చుకునే అవకాశం ఉన్నా.. ఎవరూ దానిపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. అయితే, ఓ న్యాయవాది
(Photo: DD youtube screenshot)
ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో అతి ప్రాచీనమైన గొప్ప భాష సంస్కృతం. కానీ, ఆ భాషను వేదాలు చదివే పండితులు తప్ప ఎవరూ నేర్చుకోవట్లేదు. ఇంటర్, డిగ్రీల్లో ద్వితీయ భాషగా సంస్కృతం నేర్చుకునే అవకాశం ఉన్నా.. ఎవరూ దానిపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. అయితే, ఓ న్యాయవాది మాత్రం సంస్కృతంలో చదువుకోవడమే కాదు.. కోర్టుల్లో వాదనలు సైతం సంస్కృతంలోనే వినిపిస్తున్నారు. అందుకే ప్రపంచంలోనే సంస్కృతంలో వాదనలు వినిపిస్తున్న ఏకైక న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఆయనే ఆచార్య శ్యామ్ ఉపాధ్యాయ్!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఆచార్య శ్యామ్ ఉపాధ్యాయ్ గత 38 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నారు. తొలి కేసు నుంచి ఇప్పటి వరకు ఆయన ఒప్పుకున్న కేసుల్లో వాదనలు, విచారణలు, నివేదికలు, అఫిడవిట్‌లు ఇలా అన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. తను మాట్లాడే సంస్కృతం చాలా సరళంగా ఉండటంతో కోర్టులో అందరికి ఆయన మాటలు అర్థమవుతాయట. సంస్కృతంపై ఆయనకున్న పట్టు.. అభిమానం చూసి కోర్టులో తోటి న్యాయవాదులు, న్యాయమూర్తులు సైతం ముగ్ధులవుతుంటారు. కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు సైతం శ్యామ్ ఉపాధ్యాయ్ కోసం తీర్పును సంస్కృతంలో వెల్లడిస్తారట.
చిన్నప్పుడే శపథం
ఆచార్య శ్యామ్ ఉపాధ్యాయ్ పాఠశాల విద్య సంస్కృతంలోనే జరిగింది. ఆయన చిన్నతనంలో తన తండ్రి కోర్టుల గురించి మాట్లాడుతూ.. దేశంలోని అన్ని కోర్టుల్లో సంస్కృత భాషను వాడరని చెప్పారట. సాధారణంగా కోర్టుల్లో ఇంగ్లీష్, హిందీ లేదా స్థానిక మాతృభాషలో వాదనలు జరుగుతాయి. తీర్పులు కూడా ఆయా భాషల్లోనే వెలువడుతుంటాయి. దీంతో శ్యామ్ తను న్యాయవాదినై కోర్టులో సంస్కృత భాషలోనే వాదనలు వినిపిస్తానని శపథం చేశాడట. అయితే, మొదట శ్యామ్ సంపూర్ణానంద్ సంస్కృత్ విశ్వవిద్యాలయం నుంచి బుద్ధిస్ట్ ఫిలాసఫిలో పట్టా పొందారు. ఆ తర్వాత హరిచంద్ర కాలేజ్‌లో సంస్కృతంలోనే బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసుకొని 1978లో న్యాయవృత్తిలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన వద్దకు వచ్చే కేసుల్లో పిటిషన్ దాఖలుకు దరఖాస్తు నుంచి వాదోపవాదాలు వినిపించడం వరకు అన్ని సంస్కృత భాషలోనే కొనసాగిస్తున్నారు.
రచనలోనూ ప్రావీణ్యం
కోర్టుల్లోనే కాకుండా శ్యామ్ అనేక విధాలుగా సంస్కృత భాషను పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవాదిగా కొనసాగుతూనే సంస్కృతంలో 60 నవలలు రాశారు. ఈ ప్రాచీన భాష కోసం శ్యామ్ చేస్తున్న కృషికి మెచ్చి 2003లో కేంద్ర మానవ వనరుల శాఖ ఆయన్ను ‘సంస్కృత్ మిత్రం’ అనే బిరుదుతో సత్కరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.