Minister Niranjan reddy: ఈ ఏడాది 2లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు: మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈ ఏడాది 2లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్‌ నూతనంగా సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

Published : 24 Jun 2023 19:59 IST

హైదరాబాద్: వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సూచించారు. రైతులకు ఈ వానాకాలంలో సాగు చేయాల్సిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు అందజేయాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు, వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, ఆయిల్ పామ్ సాగుపై ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

వరిలో కూనారం సన్నాలు, కూనారం 1638, బతుకమ్మ, వరంగల్ 962, ఆర్‌ఎన్‌ఆర్ 21278, ఆర్‌ఎన్‌ఆర్‌ 29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా, ఎంటీయూ 1010, జగిత్యాల 24423, ఐఆర్ 64, హెచ్‌ఎంటీ సోనా వంటి స్వల్ప కాలిక వంగడాలను సాగు చేయాలని మంత్రి సూచించారు. రాబోయే 3 రోజులు, జులై 2వ వారం నుంచి ఆగస్టు చివరి వరకు సాధారణ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించిందని తెలిపారు. వర్షాలు ఆలస్యం అయినందున క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు నాటుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

అందుబాటులో సరిపడా ఎరువులు, విత్తనాలు

రాష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యాసంగిలో అకాలవర్షాలతో పంట నష్టపోకుండా రైతులు పంటకాలాన్ని ముందుకు జరుపుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. వరి పంటకాలం ముందుకు జరుపుకొనేలా రైతులను చైతన్యం చేస్తూ వ్యవసాయ శాఖ రూపొందించిన వీడియోను సమావేశంలో విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. మార్క్ ఫెడ్‌లో తగినంత బఫర్ స్టాక్ ఉంచుకోవాలని తెలిపారు. ఎరువుల సరఫరా, వినియోగంపై అన్ని జిల్లాలలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. విత్తనాల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ఏడాది 2 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుచేయాలన్నారు. ఇప్పటికే 60వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు వచ్చారని మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు