Electricity: ఏపీలో పరిశ్రమలకు విద్యుత్‌ పరిమితులు ఎత్తివేత

ఏపీలో పవర్‌ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాపై ఎలాంటి పరిమితులు విధించడం లేదని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ తెలిపారు.

Published : 04 Sep 2023 20:32 IST

అమరావతి: రాష్ట్రంలో మారిన వాతావరణం, ప్రస్తుతం నెలకొన్న అల్పపీడన పరిస్థితులతో విద్యుత్తు వినియోగం తగ్గినందున పరిశ్రమలకు విధించాలని నిర్ణయించిన పరిమితులను ఎత్తివేస్తున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె. విజయానంద్‌ (K Vijayanand) ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల  దృష్ట్యా గ్రిడ్‌ డిమాండ్‌ కొంత మేర తగ్గిందని, గత రెండు రోజులుగా ఎలాంటి విద్యుత్‌ కొరత లేదని ఆయన అన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీపీసీసీ అధికారులతో విజయవాడలోని విద్యుత్‌ సౌధలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం లోడ్‌ కొద్దిమేర తగ్గి సరఫరా మెరుగుపడినందున పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్‌ షెడ్డింగ్‌ విధించే అవసరం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్‌ వాడకంపై పరిమితి నిబంధనల అమలును రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. 

రాష్ట్రంలో పవర్‌ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాపై ఎలాంటి పరిమితులు అమలు చేయడంలేదని విజయానంద్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నిరంగాలకు ఆదివారం ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆదివారం మొత్తం 206.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేశామని, సరఫరాలో ఎక్కడా అంతరాయాలుగానీ, లోడ్‌ షెడ్డింగ్‌గానీ లేదని చెప్పారు. సెప్టెంబర్‌ 1న రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్‌ డిమాండ్‌, సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి  కొద్దిమేర విద్యుత్‌ సరఫరా తగ్గించి,  గృహ, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి, అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేశాయన్నారు.

వ్యవసాయ, గృహ వినియోగరంగాలను పాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్‌ సంస్థలు భావించాయని, ఇందులో భాగంగానే డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేర సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేస్తామని విద్యుత్తు నియంత్రణ మండలికి అభ్యర్ధన పంపించాయని చెప్పారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల అభ్యర్ధన మేరకు ఈనెల 5 నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్‌ వాడకంలో పరిమితులు విధించేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. మెరుగుపడిన సరఫరాని దృష్టిలో ఉంచుకొని నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. వినియోగదారుల సౌకర్యార్థం ఈనెల 15వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్‌ నుండి యూనిట్‌కు రూ.9.10 చొప్పున రోజుకి దాదాపు 40 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేస్తున్నట్లు విజయానంద్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని