పెట్రో ధరలు మళ్లీ పైపైకి!

దేశంలో పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. లీటరు పెట్రోలుపై 24 పైసలు, డీజిల్‌పై 29 పైసలు ధర పెరిగింది. గరువారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

Updated : 13 May 2022 11:17 IST

ఈ నెలలో 14వ సారి పెరుగుదల
జైపుర్‌లో రూ.100 మార్కు దాటిన లీటరు పెట్రోలు 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. లీటరు పెట్రోలుపై 24 పైసలు, డీజిల్‌పై 29 పైసలు ధర పెరిగింది. గురువారం నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇలా ఇంధనం ధరలు పెరగడం ఈ నెలలో ఇది 14వ సారి. తాజా పెరుగుదలతో దిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.93.68, డీజిల్‌ ధర రూ.84.61కి చేరింది. ముంబయిలో లీటరు పెట్రోలు ధర రూ.99.94కు చేరి రూ.100 మార్కుకు చేరువ కాగా.. 30 పైసలు పెరగడంతో లీటరు డీజిల్‌ ధర రూ.91.87కు చేరింది. జైపుర్‌లో పెట్రోలు ధర రూ.100 మార్కును దాటింది. తాజా ధరల ప్రకారం లీటర్‌ పెట్రోలు రూ.100.17 కాగా.. లీటరు డీజిల్‌ ధర రూ.93.36కు ఎగబాకింది. అయితే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 మార్కును దాటగా.. తాజాగా వాటి సరసన జైపుర్‌ కూడా చేరింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీటరు పెట్రోలు, డీజిల్‌ ధరలు వరుసగా రూ.104.67, రూ.97.49గా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్‌ జిల్లాలో లీటరు పెట్రోలు, డీజిల్‌ ధరలు వరుసగా రూ.104.35, రూ.95.46గా నిలిచాయి. జైసల్మేర్‌, బన్స్వారా, ఇండోర్‌, భోపాల్‌, గ్వాలియర్‌, రెవా, రత్నగిరి, ఔరంగాబాద్‌, పర్భని జిల్లాల్లోనూ పెట్రోలు ధర రూ.100 మార్కును దాటింది. మొత్తంగా ఈ నెలలో లీటరు పెట్రోలుపై రూ.3.28, డీజిల్‌పై రూ.3.88 ధర పెరింగింది. 

ముఖ్య నగరాల్లో తాజా ధరలు:  

నగరం                      పెట్రోలు (రూ.లలో)      డీజిల్ ‌(రూ.లలో) 
దిల్లీ                         93.68                   84.61
ముంబయి                   99.94                   91.87
చెన్నై                        95.28                   89.39
కోల్‌కతా                     93.72                   87.47
బెంగళూరు                  96.80                   89.70
హైదరాబాద్‌                 97.36                   92.24
పట్నా                      95.85                   89.87
భోపాల్‌                     101.77                  93.07
జైపుర్‌                      100.17                  93.36
లఖనవూ                   91.21                    85.00
తిరువనంతపురం            95.66                    90.93

ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం లాంటి పెట్రో మార్కెటింగ్‌ కంపెనీలు ధరలను రోజువారీగా సవరిస్తుంటాయి. మారిన ధరలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి. ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల ఆధారంగా ఆయా రాష్ట్రాల పెట్రో ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని