Gurugram: కారులోంచి కరెన్సీ నోట్లు విసురుతూ.. గురుగ్రామ్‌లో ‘ఫర్జీ’ దృశ్యం!

ఓ బాలీవుడ్‌ వెబ్‌ సీరిస్‌లోని సన్నివేశాన్ని తలపించేలా ఇద్దరు నిందితులు.. కారులోంచి కరెన్సీ నోట్లు విసిరారు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Published : 15 Mar 2023 01:18 IST

చండీగఢ్‌: ఇటీవల విడుదలైన ఓ బాలీవుడ్‌ వెబ్‌ సీరిస్‌లోని సన్నివేశాన్ని తలపించేలా ఇద్దరు యువకులు కారులోంచి కరెన్సీ నోట్లు విసిరి(Throwing Currency)న ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌(Gurugram)లో కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌(Viral Video)గా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్డులో ఇద్దరు యువకులు కారులో ప్రయాణించారు. ఈ క్రమంలోనే ఒకరు వాహనం నడుపుతుండగా.. మరొకరు కారు వెనుకభాగం నుంచి రోడ్లపై కరెన్సీ నోట్లు విసిరాడు. అతడు ముఖానికి కర్చీఫ్‌ కప్పుకొని కనిపించాడు. అయితే, అవి అసలు నోట్లా..? నకిలీవా తెలియరాలేదు. దిల్లీకి చెందిన ఓ యూట్యూబర్‌ ఈ పనిచేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన ‘ఫర్జీ(Farzi)’ వెబ్‌ సీరిస్‌లోని ఓ సన్నివేశంలోనూ.. ఇద్దరు కారులోంచి నకిలీ కరెన్సీ నోట్లను రోడ్డుపైకి విసురుతూ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తారు. ఇలాంటి దృశ్యమే రీపిట్‌ చేసేందుకు యత్నించి ఈ ఇద్దరు పోలీసులకు చిక్కడం గమనార్హం. సంబంధిత వీడియో ఆధారంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని