CM KCR: మోరంచపల్లిలో హెలికాప్టర్‌తో సహాయక చర్యలు.. కేసీఆర్‌ ఆదేశాలు

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు.

Updated : 27 Jul 2023 12:46 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పూర్తిగా నీట మునిగిన మోరంచపల్లి గ్రామంలో.. సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవడం కష్టమయ్యే అవకాశం ఉన్నందున ఇండియన్‌ ఆర్మీతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ మేరకు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అధికారులతో సీఎస్ శాంతికుమారి చర్చించారు.

జలదిగ్బంధంలో మోరంచపల్లి.. చెట్లపైకి ఎక్కి తలదాచుకుని..?

అనంతరం ముంపునకు గురైన మోరంచపల్లి గ్రామానికి రెండు సైనిక హెలికాప్టర్లను పంపుతున్నట్లు సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. ఇప్పటికే మోరంచపల్లికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు. ఎప్పటికప్పుడు సీఎస్‌.. జిల్లా అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు నివేదిస్తున్నారు. మరోవైపు, ఇతర వరద ముంపు ప్రాంతాల్లో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.

వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు

మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారుల (ఐఏఎస్‌ల)ను సీఎస్‌ శాంతికుమారి నియమించారు. ములుగు జిల్లా ప్రత్యేక అధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లికి పి.గౌతమ్‌, నిర్మల్‌కు ముషారఫ్‌ అలీ, మంచిర్యాలకు భారతి హోలికేరి, పెద్దపల్లి జిల్లాకు సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్‌ జిల్లాకు హన్మంతరావును ప్రత్యేక అధికారిగా ఖరారు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని