అక్కడ కిలో ఉప్పు రూ.130.. కిలో చక్కెర రూ.150

సాధారణంగా మనదగ్గర కిలో ఉప్పు రూ.20 నుంచి రూ.30 ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాల్లో ఉప్పు ధర రూ.130కి చేరింది. ఇదేకాదు.. అక్కడ చక్కెర,

Updated : 03 Oct 2021 01:21 IST

ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత ప్రాంత గ్రామాల్లో నిత్యావసర ధరల మోత

పిథోరాగఢ్‌: సాధారణంగా మనదగ్గర కిలో ఉప్పు రూ.20 నుంచి రూ.30 ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాల్లో ఉప్పు ధర రూ.130కి చేరింది. ఇదేకాదు.. అక్కడ చక్కెర, పిండి ఇతరత్రా సరుకుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్‌ జిల్లాకు సమీపంలో ఉండే పలు హిమాలయ పర్వత ప్రాంత గ్రామాల్లో గత కొన్ని రోజులుగా నిత్యావసరాల ధరలు మోత మోగుతున్నాయి. కిలో చక్కెర రూ.150, వంట నూనె ధర రూ.275 నుంచి రూ.300, పిండి రూ.150, ఎర్ర కందిపప్పు కిలో రూ.200 పలుకుతోంది. బియ్యం ధర కూడా కిలోకు రూ.150 ఉండగా.. కేజీ ఉల్లిగడ్డ రూ.125కి చేరింది. 

ఈ గ్రామాలన్నీ భారత్-చైనా సరిహద్దుల్లో ఉంటాయి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ గ్రామాలకు వెళ్లే రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సరకుల రవాణా కష్టతరంగా మారింది. దీనికి తోడు కరోనా దృష్ట్యా నేపాలీ కూలీలు స్వదేశానికి వెళ్లిపోవడంతో సరకు రవాణాకు కూలీలు దొరకడం లేదు. దీంతో రవాణా ఛార్జీలు పెరిగాయి. నిత్యావసర వస్తువులు సరిపడా అందుబాటులో లేకపోవడంతో వీటి ధరలు కొండెక్కాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుని తమ గ్రామాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని కోరుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని