ఈ పుస్తకం మనిషిని చంపేస్తుంది!

వాల్‌పేపర్స్‌.. ఇంటి గోడల్ని ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంటాయి. కానీ, అవే వాల్‌పేపర్స్‌ ఒకప్పుడు ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఉండేవట. వాటిపై అవగాహన లేక ప్రజలు వాటిని వినియోగించడం ఓ వైద్యుడికి ఆందోళన కలిగించింది. వెంటనే ఓ

Updated : 31 Jan 2021 11:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాల్‌పేపర్స్‌.. ఇంటి గోడల్ని ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంటాయి. కానీ, అవే వాల్‌పేపర్స్‌ ఒకప్పుడు ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఉండేవట. వాటిపై అవగాహన లేక ప్రజలు వాటిని వినియోగించడం ఓ వైద్యుడికి ఆందోళన కలిగించింది. వెంటనే ఓ పుస్తకాన్ని రచించాడు. అందులోని పేజీలు తిరగేస్తే మరణించడం గ్యారెంటీ అని పేర్కొన్నాడు. వాల్‌పేపర్‌ ఏంటి? పుస్తకం ఏంటి? పేజీలు తిరగేస్తే మరణించడం ఏంటి? అని తికమకపడుతున్నారా..! అయితే ఇది చదవండి..

ఆర్సెనిక్‌ అనే రసాయన మూలకం ఎంతో ప్రమాదకరం. ఎక్కువమొత్తంలో ఇది మన శరీరంలోకి వెళ్తే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఈ రసాయన మూలకంతో తయారు చేసిన వాల్‌పేపర్స్‌ను 1860 కాలంలో అమెరికాలో ప్రజలు ఇంట్లో అలంకరణ కోసం బాగా ఉపయోగించేవారు. ఆ వాల్‌పేపర్స్‌లో ఉన్న ఆర్సెనిక్‌.. గాలి ద్వారా లేదా వాల్‌పేపర్‌ను తాకడం వల్ల మనుషుల చేతుల నుంచి శరీరంలోకి వెళ్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విషయాన్ని అమెరికా అంతర్యుద్ధం సమయంలో సర్జన్‌గా, ఆ తర్వాత రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా మారిన డాక్టర్‌ రాబర్ట్‌ ఎం. కెడ్జె గుర్తించారు. మిచిగాన్‌ రాష్ట్రానికి చెందిన రాబర్ట్‌.. ఆర్సెనిక్‌తో తయారు చేసిన వాల్‌పేపర్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని భావించారు. నోటి మాటతో చెబితే ఎవరు వింటారు అనుకున్నారేమో.. వినూత్నంగా ఓ పుస్తకం రచించారు. ఆర్సెనిక్‌ అధిక మోతాదులో కలిపి తయారు చేస్తున్న వాల్ పేపర్స్‌ను సేకరించి వాటితో 100కుపైగా పేజీలున్న ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దానికి ‘షాడోస్‌ ఫ్రమ్‌ ది వాల్స్‌ ఆఫ్ డెత్‌’ పేరు పెట్టారు. 

ఆర్సెనిక్‌ వల్ల ప్రజల ప్రాణాలకు ఎలా ముప్పు పొంచి ఉందో పుస్తకంలో రాసుకొచ్చారు. అలాగే ఈ పుస్తకం మొదటి పేజీలోనే ఈ పుస్తకంలోని వాల్‌పేపర్స్‌కు ఆర్సెనిక్‌ ఉందని, పేజీలు తిరగేసే సమయంలో అది మనిషి శరీరంలోకి వెళ్లి ప్రాణాలు తీస్తుందని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని 100 కాపీలు తీసి మిచిగాన్‌ వ్యాప్తంగా ప్రభుత్వ గ్రంథాలయాలకు పంపించారు. పుస్తకం రచించడానికి కారణాలు వివరిస్తూ.. ఆ పుస్తకాలను చిన్నారులకు దూరంగా ఉంచాలని కోరారు. రాబర్ట్‌ చెప్పిన విషయం నిజమేనని కొన్నాళ్లకు అందరికీ తెలిసింది. దీంతో గ్రంథాలయ నిర్వాహకులు ఆ పుస్తకాలను నాశనం చేశారు. దీంతో ప్రస్తుతం రాబర్ట్‌ రాసిన ‘షాడోస్‌ ఫ్రమ్‌ ది వాల్స్‌ ఆఫ్ డెత్‌’ పుస్తకం కాపీలు నాలుగు మాత్రమే ఉన్నాయి. రెండు మిచిగాన్‌లోని రెండు వేర్వేరు యూనివర్సిటీల్లో ఉన్నాయి. మరొకటి హార్వర్డ్‌ యూనివర్సిటీ మెడికల్‌ స్కూల్‌లో, ఇంకొకటి యూఎస్‌ నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌లో ఉంది. కొన్నేళ్ల కిందట. ఈ పుస్తకాన్ని డిజిటల్‌ రూపంలోకి మార్చి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని