ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: ఏపీ సర్కార్‌కు సుప్రీంలో చుక్కెదురు!

అమరావతి భూముల అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను...........

Updated : 19 Jul 2021 17:48 IST

ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం

దిల్లీ: అమరావతి భూముల అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ అంశంపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా.. దీనిపై జస్టిస్‌ వినిత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే, మెహఫూజ్‌ నజ్కి వాదనలు వినిపించగా.. ప్రతివాదుల తరఫున పరాస్‌ కుహాడ్‌, శ్యామ్‌ దివాన్‌, సిద్దార్ధ లూథ్రా వాదనలను ధర్మాసనం ముందు ఉంచారు. 

ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం కింద అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టవచ్చని, ప్రాథమిక దశలో ఉన్న విచారణను హైకోర్టు అడ్డుకుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదించారు. ఈ అంశంపై హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని, ఆ ఉత్తర్వుల్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయని, ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టానికి అనుగుణంగా దీనిపై విచారణ జరగాల్సి ఉందని వాదించారు. ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం కింద కొనుగోలుదారు అమ్మకందారుకి వివరాలు అందించాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై అనేక తీర్పులు సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు కూడా ధ్రువీకరించాయని పేర్కొన్నారు. ప్రస్తుత అమరావతిలో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం పూర్తిగా అమలవుతోందని, మొత్తం వ్యవహారంలో అనేక లోపాలు ఉన్నాయని తెలుస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని,  2019లో ప్రభుత్వం మారాకే ఫిర్యాదులు అందినట్టు దవే సుప్రీంకోర్టుకు తెలిపారు. 

మరోవైపు, ప్రభుత్వ వాదనలతో ప్రతివాద న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని న్యాయవాది పరాస్‌ కుహాడ్‌ చెప్పారు. ఏ ఒక్కరూ విభేదించనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. ఈ కేసులో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీస్‌ చట్టం వినియోగంలోకి రాదన్నారు. 2014 అక్టోబర్‌ నుంచి రాజధాని ఎక్కడో మీడియాలో వచ్చిందని, 14 గ్రామాల్లో 30వేల ఎకరాల్లో రాజధాని వస్తుందని కూడా కథనాలు వచ్చాయని ధర్మాసనానికి వివరించారు. రాజధానిపై 2014 డిసెంబర్‌ 30న ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారన్నారు. న్యాయ, చట్టపరమైన ఫిర్యాదులు నమోదు కాని కేసుగా ఇది నిలుస్తుందని పరాస్‌ కుహాడ్‌ వాదించారు. 

మరో ప్రతివాది తరఫున శ్యామ్‌ దివాన్‌ వాదననలు వినిపిస్తూ ‘‘రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చింది. ఆరేళ్ల తర్వాత భూములు అమ్మినవారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారు. భూములు అమ్మినవారు ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదని హైకోర్టు ఉత్తర్వుతో తెలుస్తోంది. ఈ కేసులో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం సెక్షన్‌ -55 వర్తించదు. రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగా జరిగిందే’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని