supreme court: జరిమానా చెల్లించాల్సిందే... తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎస్టీల రిజర్వేషన్‌ కేసులో జరిమానా చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు జడ్జిల నేతృత్వంలోని

Published : 07 Jun 2022 16:31 IST

దిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎస్టీల రిజర్వేషన్‌ కేసులో జరిమానా చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు జడ్జిల నేతృత్వంలోని ధర్మాసనం ఈకేసు విచారణ చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో టీచర్‌ పోస్టులు 100శాతం గిరిజనులకే చెందేలా జీవో ఇచ్చింది. ఆ జీవోను సవాల్‌ చేస్తూ కొన్ని ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో జీవోను నిలుపుదల చేస్తూ ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం కేసు కొట్టివేసింది. అన్ని చోట్ల రిజర్వేషన్లు రాజ్యాంగానికి లోబడి ఉండాలని స్పష్టం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.5లక్షల జరిమానా విధించింది. 

రెండు రాష్ట్రాలు సమానంగా జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.2.50లక్షల జరిమానా చెల్లించి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీవోను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జీవో అమలు నిలుపుదల చేసింది కానీ, సుప్రీంకోర్టు విధించిన రూ.2.50లక్షల జరిమానా మాత్రం చెల్లించలేదు. జరిమానా చెల్లించడంలో తెలంగాణ సర్కారు అలసత్వం ప్రదర్శించిందని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. జరిమానా చెల్లించేందుకు రెండు వారాలు సమయం ఇస్తున్నామని, రెండు వారాల్లో జరిమానా చెల్లించకపోతే కోర్టు ధిక్కరణ ప్రక్రియను చేపడతామని హెచ్చరించింది. రివ్యూ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందునే జిరిమానా చెల్లించలేదని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. వెంటనే రూ.2.50లక్షలు జరిమానా చెల్లించాల్సిందేననని, ఆ తరువాతే మిగతా విషయాలు చర్చిద్దామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని