అద్దె గర్భం ద్వారా ఆవుల ఉత్పత్తి

ఇంతవరకూ మనుషుల్లోనే సరోగసీ పద్ధతిలో గర్భాన్ని దాల్చడం చూశాం. ఇప్పుడు పశువుల్లోనూ అద్దె గర్భం ద్వారా సంతాన ఉత్పత్తికి శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారు.

Updated : 08 Nov 2021 13:26 IST

ఒంగోలు: ఇంతవరకూ మనుషుల్లోనే సరోగసీ పద్ధతిలో గర్భాన్ని దాల్చడం చూశాం. ఇప్పుడు పశువుల్లోనూ అద్దె గర్భం ద్వారా సంతాన ఉత్పత్తికి శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరులోని లాం పరిశోధన కేంద్రంలో ఈ ప్రయోగం అమలు చేస్తుండగా.. ప్రకాశం జిల్లా చదలవాడ పశు క్షేత్రంలోనూ ఒంగోలు ఆవుల జాతిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సహజ కలయిక ద్వారా, కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ల ద్వారా ఆవులు గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో ఆవు తన జీవితకాలంలో 9 నుంచి 15 దూడల వరకు జన్మనిస్తుంది. వాటి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు. అందుకు మనుషుల్లో అవలంబిస్తున్న సరోగసీ విధానాన్ని పశువుల్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. గుంటూరులోని లాం పరిశోధన కేంద్రంలో.. పశువుల్లో అద్దె గర్భం విధానాన్ని అమలు చేస్తూ తగిన ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం చదలవాడ జిల్లాలోని పశుక్షేత్రంలోనూ ప్రయోగాలు జరుగుతున్నాయి. అంతరించిపోతున్న ఒంగోలు, పుంగనూరు లాంటి జాతుల పశువుల సంతతిని పెంచేందుకు ‘ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌’ సాంకేతికతను చదలవాడ పశుక్షేత్రంలో వినియోగిస్తున్నారు. నాణ్యమైన పశువుల నుంచి వీర్యాన్ని సేకరించి పిండాభివృద్ధి చేస్తున్నారు. దీన్ని పశువుల గర్భంలోకి ఎక్కించి దూడలకు జన్మనిచ్చేలా చేస్తారు. ఈ విధానం వల్ల ఒక్కో ఆవు తన జీవితకాలంలో దాదాపు 50 దూడల వరకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. 

అత్యధికంగా 15 దూడలకు జన్మనిచ్చిన తర్వాత సహజసిద్ధమైన కలయిక వల్ల కానీ, కృత్రిమ గర్భోత్పత్తి వల్ల కానీ ఆవులు గర్భం దాల్చడం కష్టమవుతుంది. గాయాలుపాలైనా, వయసుపైబడినా గర్భం నిలవదు. అలాంటి ఆవులు.. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ సాంకేతికత ద్వారా దూడలకు జన్మనివ్వవచ్చు. ఏ జాతి పశువులకు చెందిన అండాన్ని ప్రవేశపెడితే.. అదే జాతి దూడ జన్మిస్తుంది. తల్లి లక్షణాలు మాత్రం వాటికి రావని వైద్యులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని